Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ఇరవై తొమ్మిదవ భాగము

పౌర్ణమాసీ తిథి – చంద్రుడి వృత్తాంతం

బ్రహ్మమానసపుత్రుడు అత్రిమహర్షి. ఆయన గొప్ప తపస్సంపన్నుడు. ఆయన పుత్రుడే చంద్రుడు. ఆ చంద్రుడు దక్షుడి కుమార్తెలైన 27 మంది కన్యల్ని వివాహం చేసుకున్నాడు. వారందరిలోకీ చిన్నది రోహిణి. చంద్రుడు నిత్యం రోహిణితోనే విహరిస్తూ మిగిలిన భార్యల్ని నిర్లక్ష్యం చేసేవాడు. వారంతా తండ్రి దగ్గరకి వెళ్ళి తమ భర్త తమని నిర్లక్ష్యం చేస్తున్న సంగతిని చెప్పారు. అప్పుడు దక్షుడు చంద్రుడి దగ్గరకి వచ్చి అందరు భార్యల్నీ సమానంగా చూడటం ధర్మం అని చాలాసార్లు నచ్చచెప్పాడు. అయితే ఎంత చెప్పినా చంద్రుడు తన బుద్ధి మార్చుకోలేదు.

దక్షుడికి చంద్రుడిమీద ఆగ్రహం కలిగింది. అల్లుడని కూడా చూడకుండా చంద్రుణ్ణి క్షీణించి పొమ్మని శపించాడు. చంద్రుడు కూడా దక్షుణ్ణి “నీవు కూడా సనాతనమైన బ్రహ్మ దేహాన్ని వదిలి ఎంతో మందికి జన్మించుగాక! అని తిరిగి శపించాడు.

దక్షుడి శాపం వల్ల చంద్రుడు రోజురోజుకీ క్షీణించిపోసాగాడు. క్రమంగా సోముడు అలా రూపం లేనివాడు కావటంతో దేవతలు, మనుషులు, ఓషధులు, చెట్లు అన్నీ క్షీణించిపోయాయి. అలా సృష్టి మొత్తం క్షీణించటంతో దేవతలంతా వెళ్ళి విష్ణువుతో మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు దక్షుడి శాపాన్ని మనం తప్పించలేము మీరు వెంటనే మిగిలిన ఓషధుల్ని ఈ సముద్రంలో వేసి చిలకటం ప్రారంభించండి అని చెప్పాడు. తాను కూడా రుద్రుణ్ణి స్మరించి, వారుచేసే మథనానికి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని కవ్వం త్రాడుగా ఏర్పాటుచేసాడు. ఆ విధంగా విష్ణువు మాటననుసరించి సముద్రాన్ని చిలకగా దానినుంచి చంద్రుడు తిరిగి జన్మించాడు.

మానవుల శరీరంలో క్షేత్రజ్ఞుడుగా వుండే పురుషుడే చంద్రుడని భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనస్సుకి కారకుడు చంద్రుడు కనుక. శరీరం ధరించిన వారిలో చంద్రుడు జీవుడుగా గుర్తించబడతాడు. దేవతలు, మనుషులు, పదహారు విధాలుగా ఉన్న ఇతర దేవతా గణాలు ఆయనపైనే ఆధారపడి జీవిస్తుంటారు. అలాగే వృక్షాలకి ఓషధులకీ కూడా చంద్రుడే ప్రభువు. రుద్రుడు అతడిలోని ఒక కళని తన సిగలో ధరించాడు. సృష్టిలో వున్న నీరు మొత్తం చంద్రుడి స్వరూపమే. అతడు విశ్వమూర్తి. అలాంటి చంద్రుడికి ప్రీతికరంగా పౌర్ణమి తిథిని బ్రహ్మదేవుడు ఏర్పాటుచేసాడు.

పూర్ణిమ తిథినాడు చంద్రుడి ప్రీత్యర్థం ఉపవాసం చేసి, ఆయన్ని పూజించాలి. ఆ రోజు కేవలం యవధాన్యంతో వండిన అన్నాన్నే తినాలి. అలా చేసిన వారికి చంద్రుడు జ్ఞానాన్ని, శాంతిని, కాంతిని, తుష్టిని పుష్టిని ప్రసాదిస్తాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment