అమావాస్య తిథి, పితృదేవతలు
పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు. అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూల ద్రవ్యాన్ని మనసులో నిలుపుకుని, వారిని బైటికి తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుంచి లోపల ఉన్న తన్మాత్రలు పొగరూపంలో బైటికి వచ్చాయి. పొగరంగులో వున్న ఆ దివ్య పురుషులు మేము సోమరసం త్రాగుతాం అని దేవతలతో అంటూ ఊర్థ్వలోకంవైపు వెళ్ళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు. అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుంచి లేచి కళ్ళుతెరిచాడు. ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు వారిని చూసి “ఓ దివ్యపురుషులారా! మీరు నేటి నుంచీ భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలుగా ఉండండి” అని ఆజ్ఞాపించాడు. పైన నిలిచిన పురుషుల్లో తలపైకెత్తి నిలిచిన వారు నాందీముఖులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు.
శ్రాద్ధ కర్మల్లో వృద్ధికోసం పితృదేవతల్ని వేదమార్గంలో పూజించాలి. అగ్నిని ముందుంచుకుని నిత్యాగ్ని హోత్రం చేసే విప్రులు నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలు ఆచరించేటప్పుడు, పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తి పరచాలి. బహిః ప్రావరణులు అనగా వెలుపల దర్భలమీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తి పరచాలి. అలాగే నేయి త్రాగే వారిని వైశ్యులు తర్పణాల ద్వారా సంతృప్తి పరచాలి. ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లితండ్రుల పేర్లు చెప్పుకుని ఎలాంటి మంత్ర విధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు.
ఆహితాగ్నులు కానీ, బ్రాహ్మణక్షత్రియ వైశ్యులు గానీ లౌకికాగ్నిముందు, ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి. బ్రహ్మ దేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో “ఓ పితృదేవతలారా! మానవుల ద్వారా తర్పణాలు, పూజలు అందుకున్న మీరు వారి కోరికలు తీర్చండి. ఆయువు, కీర్తి, ధనం, సంతానం, విద్య, వంటివి వారికి ప్రసాదించండి” అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటుచేసాడు.
ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటుచేసి బ్రహ్మ భూతసృష్టిని కొనసాగించాడు. అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో “ప్రభూ! మాకు కూడా ఏదో ఒక తిథిని, వృత్తిని అనుగ్రహించు అని కోరారు. బ్రహ్మ వారితో – మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను. ఆనాడు ప్రజలు దర్భలతో, నువ్వులతో, నీళ్ళతో మీకు తర్పణాలు ఇస్తారు. తద్వారా మీరు సంతృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు. అలా ఆనాటి నుంచి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయించబడింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹