చతుర్ధశీతిథి – రుద్రసంభూతి వృత్తాంతం :-
పూర్వం సృష్టిని చేయాలని ప్రయత్నించిన బ్రహ్మదేవుడు ఎంత ప్రయత్నించినా సృష్టిని ఎలా ప్రారంభించాలో స్ఫురించలేదు. ఆ కారణంగా ఎంత కాలానికీ సృష్టి వృద్ధిచెందక పోవటంతో ఆయనకి ఎంతో బాధకలిగింది. తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొద్ది సేపటికి వెంటనే ఆయన శరీరం నుంచి…
తపస్సతో తః స్థిరకీర్తిఃపురాణో రజస్తమోధ్వస్తతిర్బభూవ|
వరోవరేణ్యో వరదః ప్రతాపీకృష్ణారుణః పురుషః పింగనేత్రః ॥
(శ్లో॥ 3, అధ్యా-33)
స్థిరమైన కీర్తి కలిగినవాడు, పురాణుడు, రజస్తమో గుణప్రవృత్తి కలిగినవాడు, శ్రేష్ఠుడు, గొప్ప వరాల్ని ప్రసాదించేవాడు, నలుపు ఎరుపు కలిసిన శరీర వర్ణం కలిగినవాడు, పసుపురంగు కళ్ళతో ప్రకాశించేవాడు అయిన ఒక పురుషుడు ఉదయించాడు.
పుట్టగానే ఆ శిశువు పెద్దగా రోదించటం ప్రారంభించగా బ్రహ్మ అతన్ని రోదించవద్దని కోరాడు. అతడు ఎంతకీ ఏడుపు మానక పోవటంతో అతడి కోరిక మేరకు అతడికి ”రుద్రుడు” అని నామకరణం చేసాడు. ఆ తరువాత సృష్టిని కొనసాగించమని రుద్రుణ్ణి ఆదేశించాడు.
అయితే రుద్రుడు బ్రహ్మ మాటని తక్షణమే పాటించకుండా తపస్సు చేసుకోవాలని నీళ్ళలో మునిగాడు. అలా రుద్రుడు నీళ్ళలో తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోగా బ్రహ్మ తన సృష్టిని ఎలాగైనా కొనసాగించాలని భావించి మానస పుత్రుల్ని సృష్టించాడు. మరీచ్యాది మానసపుత్రులంతా ప్రజాపతులై సృష్టిని క్రమంగా వృద్ధి పరిచారు. ఆ విధంగా సృష్టి బాగా వ్యాప్తి చెందింది.
ఒకనాడు దేవేంద్రుడు బ్రహ్మ గురించి గొప్పయాగం చేయటం ప్రారంభించాడు. అదే సమయంలో రుద్రుడు తపస్సు చాలించి, సృష్టిచేయాలని నీళ్ళలోంచి బైటికి వచ్చాడు. రాగానే ఎదురుగా దేవతలు సిద్ధులు అందరూ కలిసి యజ్ఞసన్నాహాలు చేస్తూ కనిపించారు. రుద్రుడికి కోపం వచ్చింది. తనను కాదని ఈ సృష్టినంతా ఎవరు సృష్టించారు అని గట్టిగా అరిచాడు. అలా అరుస్తున్న రుద్రుడి నోటిలోంచి భయంకరమైన జ్వాలలు ఆవిర్భవించాయి. ఆ జ్వాలల్లోంచి అంతరిక్ష పిశాచాలు, భేతాళగణాలు, భూతాలు, యోగులు, వేలాదిగా వెలువడ్డారు. వారందరి రాకతో భూమి అకాశం అన్నీ నిండిపోయాయి.
రుద్రుడు సర్వాన్నీ తెలిసినవాడు ఇరవై నాలుగుమూరల కొలతతో ఒకపెద్ద విల్లుని నిర్మించాడు. మూడుపేటల అల్లెత్రాడుని దానికి అమర్చాడు. ఆ థనువుని తీసుకుని దాంతో పూఘడి పళ్ళను ఊడగొట్టాడు. భగుడి నేత్రాల్ని పీకేశాడు, క్రతువు వృషణాల్ని రాలగొట్టాడు. ఇలా అక్కడ జరుగుతున్న యాగాన్నంతా తను తన అనుచర గణాలు కలిసి ధ్వంసం చేసారు. అప్పుడు దేవతలంతా రుద్రుణ్ణి చేరి శాంతించమని ప్రార్ధించారు.
విషయం తెలిసిన బ్రహ్మ వెంటనే అక్కడికి వచ్చాడు. రుద్రుణ్ణి శాంతించమని కోరాడు. అప్పుడు రుద్రుడు “పితామహా! వీరందరికన్నా నీవు నన్నే కదా ముందు సృష్టించావు. వీరంతా నా తరువాత పుట్టి నాకు యజ్ఞభాగాన్నివ్వటం లేదు. అందుకే వీరందరికీ గుణపాఠం నేర్పాలని దండించాను” అని అన్నాడు. రుద్రుడి వాదన సత్యమేనని గ్రహించిన బ్రహ్మ దేవతలందర్నీ పిలిచి రుద్రుణ్ణి భక్తిగా స్తుతించి శాంతపరచమని ఆదేశించాడు. దేవతలంతా శ్రద్ధాభక్తులతో బ్రహ్మ చెప్పిన విధంగా రుద్రుణ్ణి ఇలా ఘనంగా స్తుతించారు.
దేవతలు చేసిన రుద్రస్తుతి :-
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే
రక్తపిఙ్గలనేత్రాయ జటామకుట ధారిణే
భూతబేతాళ జుష్టాయ మహాభోగోపవీతినే,
భీమాట్టహాస వక్రాయ కపర్దిన్ స్థాణవే నమః
పూష్ణో దన్తవినాశాయ భగనేత్రహనే నమః
భవిష్య వృషచిహ్నాయ మహాభూతపతే నమః
భవిష్యతి పురాన్తాయ తథాన్దక వినాశినే
కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే
వికారాళోర్ద్వకేశాయ భైరవాయ నమోనమః
అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతే నమః
భవిష్యకృత కాపాలి వ్రతాయ పరమేష్ఠినే తథా దారువనధ్వంస కారిణే తిగ్మశూలినే
కృతకజణ భోగీన్ద్ర నీలకణ్ణ త్రిశూలినే ||
ప్రచణ దణ్ణ హస్తాయ వడవాగ్నిముఖాయ చ
వేదాన్తవేద్యాయ నమో యజ్ఞ మూర్తే నమో నమః
దక్షయజ్ఞ వినాశాయ జగద్భయ కరాయ చ
విశ్వేశ్వరాయ దేవాయ శివశంభు భవాయ చ
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః
(శ్లో॥ 15-24, అధ్యా-33)
ఈవిధంగా దేవతలందరూ స్తుతించగా భయంకరమైన ధనస్సు ధరించిన రుద్రుడు దేవతలందరితో “నేను దేవుళ్ళకే దేవుణ్ణి. మీకేం కావాలో కోరుకోండి” అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ మూకుమ్మడిగా దేవా! మా తప్పుల్ని మన్నించి మానుంచి నీవు లాక్కున్న వేదశాస్త్ర విజ్ఞానాన్ని, రహస్యమైన మంత్రాలతో కూడిన శాస్త్ర విజ్ఞానాన్ని, రహస్యమైన మంత్రాలతో కూడిన యజ్ఞవిధానాన్ని తిరిగి మాకు ప్రసాదించు” అని కోరారు. రుద్రుడు వారికి అడిగినవన్నీ ప్రసాదించి దేవతలారా! మీరందరూ పశువులు నేను పశుపతిని, నా మీద శ్రద్ధా భక్తులు కలిగివున్న వారందర్నీ నేను రక్షిస్తాను అని వారందరికీ అభయాన్నిచ్చాడు.
బ్రహ్మదేవుడు పశుపతి అయిన రుద్రుడి మాటలు విని సంతోషించి ఆయనతో “దేవా! నీకు చతుర్దశి తిథి ప్రీతికరమైనదగుగాక! ఈ పవిత్ర తిథినాడు ఉపవాసముండి, శ్రద్ధగా నిన్ను పూజించి బ్రాహ్మణులకి అన్నసంతర్పణ చేసే వారికి నీవు సకల శుభాల్నీ ప్రసాదించు. వారు కోరిన కోర్కెలు తీర్చు” అని కోరాడు. శివుడు సరేనని అభయమిచ్చి తన చేతిలో చావుదెబ్బలు తిన్నవారందరికీ పూర్వరూపం కలిగేలా చేసాడు.
ఎవరైతే చతుర్దశినాడు తెల్లవారుఝామునే నిద్రలేచి ఈ రుద్రవృత్తాంతాన్ని శ్రద్ధగా వింటారో లేక పఠిస్తారో వారు సకల పాపాలనుంచీ విముక్తి పొంది రుద్రలోకానికి చేరుకుంటారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹