Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఆరవ భాగము

త్రయోదశి – ధర్మోత్పత్తి వృత్తాంతం

పూర్వం అవ్యయుడు, సనాతనుడు అయిన బ్రహ్మ ప్రజల్ని సృష్టించాలని సంకల్పించాడు. అయితే తాను సృష్టించిన ప్రజల్ని పాలించేవాడెవరు? అన్న సందేహం ఆయనకి వచ్చింది. అలా ఆయన చింతిస్తుండగా బ్రహ్మ కుడిభాగం నుంచి తెల్లటి కుండలాలు, తెల్లటి పూలమాలలు ధరించిన పురుషుడు ఆవిర్భవించాడు. ఆ దివ్య పురుషుణ్ణి చూసిన బ్రహ్మ అతడితో ” ఉత్తముడా! నీవు నేను సృష్టించిన ప్రజలందర్నీ పాలించు. ఈ జగత్తంతా నీవే ఆదిపురుషుడివి” అని అన్నాడు.

బ్రహ్మదేవుడి ఆదేశాన్ననుసరించిన ఆ పురుషుడు కృతయుగంలో నాలుగుపాదాలతో, త్రేతాయుగంలో మూడు పాదాలతో, ద్వాపరంలో రెండు పాదాలతో, కలియుగంలో ఒక పాదంలో నిలిచి ప్రజల్ని పాలించాడు. అతడే ధర్మపురుషుడు. ఆ ధర్మపురుషుడు బ్రాహ్మణుల్లో ఆరు భావాలతో, క్షత్రియుల్లో మూడు భావాలతో, వైశ్యుల్లో రెండు భావాలతో, శూద్రుల్లో ఒకే భావాలతో నెలకొని తన పాలన కొనసాగించాడు.

బ్రాహ్మణుల్లో ఆరు భావాలుగా అంటే )

1.యజనం (యజ్ఞంచేయటం)

2. యాజనం (యజ్ఞాలు చేయించటం)

3. అధ్యయనం (వేదాల్ని పఠించటం)

4. అధ్యాపనం (వేదాల్ని శిష్యులతో చదివించటం)

5. దానం (దానంచేయటం)

6. ప్రతిగ్రహణం (దానాన్ని పుచ్చుకోవటం)

అనేవి.ఇక క్షత్రియుల్లో మూడు భావాలతో అనగా

1. యజ్ఞం చేయటం

2. వేదాల్ని చదవటం

3. దానంచేయటం, అలాగే వైశ్యుల్లో

1. వ్యవసాయం 2. వాణిజ్యం, శూద్రుల్లో వివిధవృత్తులు చేపట్టటం ద్వారా అన్నివర్ణాల వారికీ తోడ్పడటం. ఈ విధంగా ధర్మపురుషుడు సమస్తలోకాల్నీ ద్వీపాల్నీ పాలించాడు.

ధర్మపురుషుడికి ద్రవ్యం-గుణం-క్రియాజాతి అనేవి నాలుగు పాదాలు. సంహితం, పదం, క్రమం అనేవి ఆధర్మవృషభరూఢపురుషుడికి మూడు కొమ్ములు ఓంకారం మొదలు, తుది అనేవి అతడి రెండు తలలు. ఏడు విభక్తులు అతడి ఏడుచేతులు. ఉదాత్త అనుదాత్త స్వరితాలు అనే మూడు విధాలుగా రూపొందిన నాదమయరూపుడు ఆ ధర్మపురుషుడు. గొప్పజ్ఞాన సంపన్నుడైన ఆ మహానుభావుడు బ్రహ్మ ఆదేశాన్ననుసరించి జగత్తునంతా పాలిస్తున్నాడు.

ఒకనాడు చంద్రుడు అధర్మంగా బృహస్పతి భార్య తారని చెరపట్టటంతో ధర్మపురుషుడికి ఎంతో కష్టం కలిగింది. ఆయనెంతో బాధపడ్డాడు. తన అధర్మ ప్రవర్తనతో భయపెట్టగా ధర్మపురుషుడు ఎవరూ చేరరాని అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధర్మపురుషుడు లోకాల్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోవటంతో అన్ని లోకాల్లో అధర్మచింతన పెరిగిపోయింది. దేవతలు అసురుల భార్యల్ని అలాగే అసురులు దేవతల భార్యల్ని చెరబట్టాలని ప్రయత్నిస్తున్నారు.

చంద్రుడు చేసిన పనివల్ల ధర్మం నశించిపోగా స్త్రీల కారణంగా దేవతలు రాక్షసులు పరస్పరం దాడులు చేసుకోవటం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన నారదుడు సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి ఆయనకీ విషయాన్ని తెలియచేసాడు. వెంటనే బ్రహ్మ హంసవాహనం మీద యుద్ధరంగానికి వచ్చి దేవతల్ని దానవుల్ని సముదాయించి వారుయుద్ధం విరమించేలా చేసాడు. అసలు ఎందుకు మీరీయుద్ధం చేస్తున్నారు అని ప్రశ్నించగా వారంతా సోముడి (చంద్రుడి) వల్లే మేము యుద్ధం చేస్తున్నాం అన్నారు. బ్రహ్మదేవుడు జరిగిందంతా దివ్యదృష్టితో చూసాడు. ఆయనకి సత్యం బోధపడింది. ధర్మపురుషుడు అడవిలోకి వెళ్ళిపోయాడని తెలుసుకున్నాడు.

బ్రహ్మదేవుడు వెంటనే దేవతలందర్నీ అసురుల్ని వెంటబెట్టుకుని ధర్మపురుషుడున్న చోటుకి వెళ్ళాడు. అక్కడ ధర్ముడు నాలుగుపాదాలతో సంచరిస్తున్నాడు. అతన్ని దేవతలకీ, అసురులకీ చూపించి “సురాసురులారా! ఇతడే ధర్మపురుషుడు నా మొదటి కుమారుడు. చంద్రుడు చేసిన అధర్మం వల్ల భయపడి ఈ అడవిలోకి వచ్చాడు. మీరంతా ఇతన్ని సంతోషపెట్టండి. దానివల్ల మీ ఇద్దరికీ మేలు జరుగుతుంది” అని పలికాడు. బ్రహ్మ మాటలు విన్న దేవ దానవులంతా చంద్రుడిలా ప్రకాశించే ఆ ధర్మపురుషుణ్ణి భక్తితో ఇలా స్తుతించారు.

దేవతలు చేసిన ధర్మపురుషస్తుతి :-

నమోస్తు శశిసంకాశ నమస్తే జగతః పతే,

నమోస్తు దేవరూపాయ స్వర్గమార్గ ప్రదర్శక

కర్మమార్గ స్వరూపాయ సర్వగాయ నమో నమః |

త్వయేమం పాల్యతే పృథ్వీ త్రైలోక్యంచ త్వయైన హి

జన స్తపస్తథా సత్యం త్వయా సర్వంతు పాల్యతే ॥

న త్వయా రహితం కిఞ్చ జ్జగత్ స్థావరజంగమమ్ విద్యతే

తద్విహీనం తు సద్యో నశ్యతి వై జగత్ |

త్వమాత్మా సర్వభూతానాం సతాం సత్త్వస్వరూపవాన్

రాజసానాం రజస్వంచ తామసానాం తమోమయః ॥

చతుష్పాదో భవాన్ దేవ చతుశ్శృఙ్గ స్త్రిలోచనః

సప్తహస్తి స్త్రీ బన్దశ్చ వృషరూప నమోస్తుతే ॥

త్వయా హీనా వయం దేవ సర్వ ఉన్మార్గ వర్తినః

తన్మార్గం యచ్చ మూఢానాం త్వం హి నః పరమాగతిః ॥

(20-25,-32)

ఈ విధంగా దేవతలు చేసిన స్తుతి విని ధర్మపురుషుడు సంతోషించాడు. వృషభరూపంలో వున్న ఆ ధర్ముడు ఎంతో ప్రశాంతంగా వారిని చూసాడు. అంతే పరమపవిత్రమైన అతడి చూపుసోకగానే వారంతా మోహాన్ని వదిలేశారు. కేవలం దేవతలే కాదు రాక్షసులు కూడా ధర్ముడి ప్రభావంతో తమలోని తామసగుణాన్ని వదిలేశారు. అలా దేవదానవులిద్దరూ ధర్మపరాయణులై పోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారందర్నీ చూసి ఎంతో ఆనందించి ధర్ముడితో ఇలా అన్నాడు.

ఓధర్మా! ఈ రోజునుంచి నీకు త్రయోదశి ప్రీతికరంగా ఉండుగాక! పవిత్రమైన ఈ తిథినాడు ఉపవాసముండి నిన్ను స్మరించినవాడు ఎన్ని పాపాలు చేసినా వాటినుంచి విముక్తి పొందుతాడు. నీవు చాలాకాలం ఈ అరణ్యంలో నివసించినందువల్ల దీనికి ధర్మారణ్యం అనే పేరు వస్తుంది.

కృతయుగంలో నాలుగుపాదాలతో, త్రేతాయుగంలో మూడుపాదాలతో, ద్వాపరంలో రెండు పాదాలతో, కలియుగంలో ఒక్క పాదంతో సంచరిస్తూ నీవు భూలోక వాసులకి కనిపిస్తూ! ఇక పైలోకాల్లో నీవు సొంతఇంట్లో ఉన్నట్టే సంచరిస్తూ అన్ని లోకాల్నీ రక్షించు. ఇలా పలికి బ్రహ్మదేవుడు అక్కణ్ణుంచి అదృశ్యుడయ్యాడు. ధర్ముడి ప్రభావంతో దేవతలు కూడా దుఃఖాన్ని వదిలి ధర్మబుద్ధిని పెంచుకుని తమ తమ నివాసాలకి వెళ్ళిపోయారు.

పరమపవిత్రమైన ఈ ధర్ముడి కథని విన్నవారు, వినిపించిన వారు శ్రాద్ధకర్మల్లో పితృదేవతలకి తర్పణం చేసే, త్రయోదశి తిథినాడు శక్తికొద్దీ పాయసంతో భోజనం పెట్టేవాడు స్వర్గాన్ని చేరి సుఖభోగాలనుభవిస్తారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment