ద్వాదశి తిథి – వైష్ణవ వృత్తాంతం
పూర్వం పరబ్రహ్మ అయిన నారాయణుడికి ఈ సృష్టి గురించి ఒక ఆలోచన వచ్చింది. “ఈ సృష్టినంతా నేనే చేసాను కదా! కనుక నేనే దీన్ని పాలించాలి.
అసలు ఆకారంలేని సృష్టితో ఏ పనీ చేయటం వీలుకాదు. కనుక నేనొక మూర్తిని సృష్టించటం మంచిది. అదే ఈ జగత్తునంతా పాలిస్తుంది” అని తలచాడు. ఇలా ఆయన భావిస్తూ ఉండగానే పూర్వం తాను చేసిన సృష్టి మొత్తం ఆయనకి కనిపించింది. అంతటి సృష్టి మొత్తం తన ముందు నిల్చుండగా, తన శరీరంలోనుంచి మూడులోకాలు బైటికి వచ్చి ఎదురుగా ఉన్న సృష్టిలోకి ప్రవేశించాయి. ఆ విషయాన్ని నారాయణుడు గమనించాడు.
నారాయణుడు పూర్వం తను వాక్కుకి ఇచ్చిన వరాన్ని స్మరించాడు. ఆ వాక్కుతో నీవు సర్వాన్నీ ఎరిగినవాడివి, సర్వానికీ కర్తవి. సకలలోకాలూ నీకు మ్రొక్కుతాయి. మూడులోకాల్లో నీవు ప్రవేశించటం వల్ల నీవు సనాతనుడైన విష్ణువుగా ప్రసిద్ధిచెందుతావు. బ్రహ్మదేవుడు ఎల్లప్పుడూ సకల దేవతలకీ కార్య సిద్ధిచేకూరుస్తుంటాడు. ఓదేవా! నీకు సర్వజ్ఞత్వం కలుగుగాక! అని పలికి నారాయణ పరబ్రహ్మ తిరిగి యథాస్థితికి వచ్చాడు.
విష్ణువు తిరిగి పూర్వపు బుద్ధిని స్మరించి ఇంద్రియాల ద్వారా పుట్టిన ప్రజలందర్నీ తనలో స్థాపించి యోగనిద్రని ఆశ్రయించాడు. అలా గాఢనిద్రపోయిన ఆ పరమాత్మ నాభి నుంచి పెద్ద కమలం ఆవిర్భవించింది. ఆ పద్మంలో ఏడు ద్వీపాలతో సముద్రాలతో, అడవులతో నిండిన భూమికూడా ఏర్పడింది. ఆ రకంగా పద్మం ఎంతో విశాలంగా విస్తరించింది. ఆ పద్మంకాడ పాతాళలోకంలో నెలకొంది. దాని బొడిప మీద మేరు పర్వతం ఉంది. దాని మధ్యలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు.
ఆ విధంగా నారాయణుడి శరీరం నుంచి పుట్టిన పద్మాన్ని అందులో వున్న భూమండలాన్ని చూసి ఆయన శరీరంలోనే ఉన్న వాయువు మరో వాయువుని సృష్టించి బైటికి వదిలింది. లోపలున్న వాయువు బైటి వాయువుతో స్వామీ! అజ్ఞానాన్ని జయించటానికి శంఖాన్ని ధరించు. ఇదిగో ఈ ఘోరమైన కాల చక్రాన్ని అధర్మమనే ఏనుగుని మోదటానికి గదని, భూతలానికి తల్లి అయిన ఈ వనమాలని, సూర్య చంద్రులకి బదులుగా శ్రీవత్సాన్ని కౌస్తుభాన్ని ధరించు. ఈ వాయువే నీ గమనం. దీన్నే గరుత్మంతుడంటారు.
ఈ వాయురూపుడైన గరుత్మంతుణ్ణి అధిరోహించి ముల్లోకాలూ సంచరించు. లక్ష్మీదేవి నిన్నెప్పుడూ ఆశ్రయించి ఉంటుంది. నీకు ద్వాదశితిథి ఎంతో ప్రీతికరమైనది.
విష్ణుస్తుతి :-
నమామి విష్ణుం త్రిదశారినాశనం విశాల వక్షః స్థల సంశ్రితశ్రియమ్ |
సుశాసనం నీతిమతాం పరాం గతిం త్రివిక్రమం మన్దరధారిణం సదా ॥
దామోదరం రక్షితభూతలం ధియా
యశోంశుశుభ్రం భ్రమరాఙ్గ సప్రభమ్ ।
ధరాధరం నరకరిపుం పురుషుతం
నమామి విష్ణుం శరణం జనార్ధనమ్ ॥
నరం నృసింహం హరి మీశ్వరం ప్రభుం త్రిధామనామాన మనన్త వర్చసమ్ ।
సుసంస్కృతాస్యం శరణం నరోత్తమం ప్రజామి దేవం సతతం త మచ్యుతమ్ ||
త్రిధా స్థితం తిగ్మ రథాఙ్గ పాణినం నయస్థితం తృప్త మమత్తమై రుణైః |
నిః శ్రేయసాఖ్యం క్షపితేతరం గురుం
నమామి విష్ణుం పురుషోత్తమం త్వహమ్ ||
హతౌ పురాణె మధుకైటభా వుభౌ
బిభర్తి చ క్ష్మాం శిరసా సదా హి సః ।
యథా స్తుతో మే ప్రసభం సనాతనో
దధాతు విష్ణుః సుఖ మూర్జితం మమ ॥
మహావరాహో హవిషామ్భుభోజనో జనార్దనో మే హితకృచ్చితీముఖః!
క్షితీధరో మా ముదధిక్షయో మహాన్ స పాతు విష్ణుః శరణార్థినం తు మామ్ ॥
మాయాతతం యేన జగత్రయం కృతం యథాగ్ని నైకేన తతం చరాచరమ్ |
చరాచరస్య స్వయ మేవ సర్వతః స మే స్తు విష్ణుః శరణం జగత్పతిః ||
భవే భవే యశ్చ ససర్జ కం తతో
జగత్ ప్రసూతం సచరాచరం త్విదమ్ |
తతశ్చ రుద్రాత్మవతి ప్రలీయతే
స్వతో హరిర్విష్టు హర స్తథోచ్యతే ॥
ఖాత్మేన్దు పృథ్వీ పవనాగ్ని భాస్కరా
జలం చ యస్య ప్రభవన్తి మూర్తయః |
స సర్వదా మే భగవాన్ సనాతనో
దదాతు శం విష్ణు రచిన్త్యరూపధృక్ ॥
(శ్లో॥18-21,అధ్యా-31)
పవిత్రమైన ద్వాదశినాడు నీమీదే స్థిరంగా మనసు నిలిపి, నేయితో అన్నాన్ని భుజిస్తూ నీ పూజ చేసేవ్యక్తి స్త్రీగానీ పురుషుడుగానీ స్వర్గానికి చేరుకుంటారు. దేవదానవుల స్వరూపాలన్నీ విష్ణు రూపాలే. విష్ణువే ఈ లోకాలన్నిటిన్నీ సృష్టించి, రక్షించి లయం చేస్తుంటాడు. ప్రతియుగంలో విష్ణువే సర్వత్రా వ్యాపించి వుండే పరమదైవం. ఈయన్నే వేదాంతపురుషుడంటారు. హీన బుద్ధితో విష్ణువుని మానవుడుగా భావించకూడదు. సకల పాపాల్నీ పటాపంచలు చేసే ఈ విష్ణుసృష్టి వృత్తాంతాన్ని వినేవారు. కీర్తి ప్రతిష్ఠల్ని పొంది స్వర్గలోకానికి చేరుకుంటారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹