దశమీతిథి – దిక్కుల వృత్తాంతం :-
ఆరంభంలో సృష్టిని మొదలుపెట్టిన బ్రహ్మదేవుడికి నేను సృష్టించిన ప్రజల్ని ఎవరు ధరిస్తారు? అన్న సంశయం కలిగింది. ప్రజల గురించి ఇలా ఆలోచిస్తుండగా ఆయన చెవుల్లోంచి గొప్ప కాంతితో వెలిగిపోతున్న పదిమంది కన్యలు పుట్టుకొచ్చారు. వారిలో 1. తూర్పు 2. దక్షిణం 3. పడమర 4. ఉత్తరం 5. పైదిక్కు 6. క్రిందిదిక్కు అనే ఆరుగురు కన్యలు ముఖ్యమైనవారు. ఇక మిగిలిన నలుగురు కన్యలు ఎంతో అందగత్తెలు. వారు నలుగురూ ప్రజాపతి దగ్గరకి వెళ్ళి ఆయనతో “స్వామీ! మాకు కూడా తగిన చోటుని చూపించండి. మేము సుఖంగా ఉండేలా మాకు తగిన స్థానాన్ని, తగిన భర్తల్ని కూడా ప్రసాదించండి అని కోరారు.
బ్రహ్మదేవుడు నలుగురు కన్యల మాటవిని, “సుందరీమణులారా! ఈ బ్రహ్మాండం మొత్తం వందకోట్ల యోజనాల మేర వ్యాపించింది. ఈ బ్రహ్మాండం చివర మీ ఇష్టం వచ్చిన చోట మీరు నివసించండి. వెంటనే వెళ్ళండి. మీకు తగిన భర్తల్ని నేను సృష్టించి ఇస్తాను. ముందు మీకు నచ్చిన ప్రదేశాలకి చేరుకోండి” అని అన్నాడు. బ్రహ్మ ఆదేశం విని ఆ నలుగురు కన్యలు అక్కణ్ణుంచి బయలుదేరి తమకు నచ్చిన ప్రదేశాలకి వెళ్ళారు.
బ్రహ్మదేవుడు వెంటనే మహాబలవంతులైన లోక పాలకుల్ని సృష్టించాడు. వారు మొత్తం ఎనిమిది మంది
- ఇంద్రుడు 2. అగ్ని 3. యముడు 4. నిరృతి 5. వరుణుడు 6. వాయువు 7. కుబేరుడు 8. ఈశానుడు.
బ్రహ్మ తను సృష్టించిన కన్యల్ని పిలిచి వారిలో ఎనిమిది మందికి ఈ ఎనిమిది మంది కన్యల్ని ఇచ్చి వివాహం జరిపించాడు. పది దిక్కుల్లో మిగిలిన ఊర్ధ్వ దిక్కుని తన ఆధీనంలో ఉంచుకుని, అథో దిక్కుకి అధిపతిగా ఆదిశేషుణ్ణి నియమించాడు.ఈ విధంగా బ్రహ్మదేవుడు వారందరికీ దిక్కుల్ని ప్రసాదించి, ఆ దిక్కులన్నిటికీ పుణ్యమైన తిథిగా దశమీతిథిని ఏర్పరిచాడు. తరువాత దిక్కులన్నీ బ్రహ్మ సృష్టించిన దిక్పాలకుల పేరుతో ప్రసిద్ధమయ్యాయి. అలాగే దిక్పాలకుల భార్యలు కూడా ఐంద్రీ తదితర పేర్లతో విఖ్యాతి చెందారు. వీరందిరికీ పెరుగు కలిపిన అన్నం నైవేద్యంగా చెప్పబడింది. దశమీ తిథినాడు పెరుగన్నం తిని నియమపూర్వకంగా దశ దిక్పాలకుల్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. దిక్పాలకుల గురించిన ఈ కథనాన్ని విన్నవారు చదివిన వారు సకల పాపాలనుంచీ విముక్తులై బ్రహ్మ లోకంలో శాశ్వత నివాసాన్ని పొందుతారు. ఇందుకు సందేహమే లేదు. ఏకాదశీతిథి – కుబేరుడి వృత్తాంతం :- సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మదేవుడి ముఖం నుంచి తీవ్రమైన గులకరాళ్ళని వర్షిస్తూ వాయువు వెలువడింది. బ్రహ్మ ఆ వాయువుని నిలువరించి “శాంతించు, ఆకారాన్ని ధరించు” అని వాయువుని కోరాడు. వెంటనే వాయువు ఆకారాన్ని ధరించి దేవా! నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. బ్రహ్మ అతడితో వాయూ! నీవు దేవతలు ఆర్జించిన ధనాన్ని వాటి ఫలాన్ని సంరక్షిస్తూ ఉండు అని ఆదేశించాడు. ఆనాటి నుంచి వాయువు వసుపతి – ధనానికి అధిపతి అయ్యాడు. ఆ వాయువే రూపాన్ని ధరించి కుబేరుడుగా ప్రసిద్ధిచెందాడు. కుబేరుడు ధనాధిపతి పదవిని సక్రమంగా నిర్వహిస్తుండటంతో బ్రహ్మ సంతోషించి అతడికి ఏకాదశి తిథిని ప్రసాదించాడు. కుబేరుడికి ప్రీతికరమైన ఏకాదశినాడు నిప్పుతో వండని పదార్థాన్ని ఆహారంగా స్వీకరిస్తూ ఆయన్ని శ్రద్ధగా పూజిస్తే కుబేరుడు ధనసంపదల్ని వారికి అనుగ్రహిస్తాడు. కుబేరుడి వృత్తాంతం విన్నవారు పఠించిన వారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని పొందుతారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹