Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ఇరవై మూడవ భాగము

నవమీతిథి, దుర్గాదేవి వృత్తాంతం

పూర్వం సింధుద్వీపుడనే మహారాజుండేవాడు. అతడు వరుణుడి అంశతో జన్మించాడు. ఈ సింధుద్వీపుడు పూర్వజన్మలో ఇంద్రుడి చేత చంపబడ్డ త్వష్టుడి కుమారుడు. అతడికి తిరిగి సింధుద్వీపుడుగా జన్మించాక ఇంద్రుడి మీద పగతీర్చుకోవాలనిపించింది. అందుకోసం ఇంద్రుణ్ణి చంపగల పుత్రుణ్ణి కోరి కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు. ఒకనాడు వేత్రవతి అనే సుందరమైన కన్య సింధుద్వీపుడు తపస్సుచేస్తున్న ప్రాంతానికి వచ్చింది. దివ్య సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెని చూసి సింధుద్వీపుడు ఆకర్షితుడై “భామినీ! ఎవరు నీవు ఎందుకిక్కడికి వచ్చావు? అని ప్రశ్నించాడు.

ఆ సుందరి సింధు ద్వీపుడితో “ప్రభూ!నేను వరుణిడి భార్యని. నాపేరు వేత్రవతి. నీ సౌందర్యం చూసి నీతో నే గడపాలని ఇక్కడికి వచ్చాను. దయచేసి నన్ను తిరస్కరించవద్దు. కోరి వచ్చిన పడతిని తిరస్కరించిన వాడికి పాపం చుట్టుకుంటుంది. అది బ్రహ్మహత్యతో సమానమైనది. కనుక నన్ను కాదనక స్వీకరించు అని ప్రార్థించింది.

సింధుద్వీపుడు కూడా ఆమె అందచందాలు చూసి ఆమెని కామించాడు. వెంటనే మారుమాట్లాడకుండా ఆమెను స్వీకరించి సుఖభోగాలనుభవించాడు. అలా కొంతకాలం సాగింది. వారిద్దరికీ పన్నెండుమంది సూర్యులతో సమానుడైన పుత్రుడు జన్మించాడు.

వేత్రవతి కడుపునపుట్టిన కారణంగా అతడు వైత్రాసురుడనే పేరుతో ప్రసిద్ధిచెందాడు. ఎంతో గొప్పబలసంపన్నుడైన ఆ వైత్రాసురుడు ప్రాగ్జోతిషపురానికి రాజయ్యాడు. కొంతకాలంలోనే అతడు సమస్త భూమండలాన్నీ జయించి స్వాధీనం చేసుకున్నాడు.

వైత్రాసురుడు సప్తద్వీపాలలో ఉన్న భూమిని గెలిచి ఆ తరువాత దేవతలందరూ నివసించే మేరు పర్వతం మీదకి దండెత్తాడు. అక్కడ ముందుగా ఇంద్రుణ్ణి ఆ తరువాత వరుసగా అగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుల్ని గెలిచాడు.

అలా వైత్రాసురుడి చేతిలో ఓడిపోయిన అష్టదిక్పాలకులంతా కలిసి తమ తమ బాధల్ని ఒకరికొకరు చెప్పుకున్నారు. వైత్రాసురుడు అక్కణ్ణుంచి బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివుడు కూడా అతన్ని జయించలేక సిద్ధుల్ని, మునుల్ని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు.

జగత్తుని సృష్టించే బ్రహ్మ తన లోకంలో విష్ణువు పాదాలనుంచిపుట్టిన పవిత్రజలం లోపల భాగంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని మాయాస్వరూపిణి అయిన గాయత్రీదేవిని జపిస్తూ కూర్చున్నాడు. దేవతలంతా లోపలికి ప్రవేశించి ఓ పితామహా! రక్షించు, కాపాడు! అని నినాదాలు చేసారు.

బ్రహ్మ ధ్యానంలోంచి కళ్ళు తెరిచిచూసేసరికి ఎదురుగా దేవతలంతా కనిపించారు. అయితే ఆయన వాళ్ళందర్నీ చూసి ఇదంతా మాయలా ఉందే. వీళ్ళంతా నన్ను భ్రమింప చేస్తున్నారు. అసలు దేవతలు లేరు, రాక్షసులు లేరు అని భావించి తిరిగి కళ్ళు మూసుకున్నాడు.

అంతలో వైత్రాసురుడు దేవతల్ని వెంట తరుముతూ వారితో పాటు తానుకూడా బ్రహ్మలోకానికి వచ్చాడు. అక్కడున్న దేవతల్ని పట్టుకుని హింసించటం ప్రారంభించాడు. వారి హాహాకారాలు విన్న బ్రహ్మ మరోసారి కళ్ళుతెరిచాడు. ఒక్కసారిగా ఆయనముందు ఒక కన్య ప్రత్యక్షమయ్యింది.

తెల్లని వస్త్రాలు, పూలమాల, కిరీటం ధరించిన ఆమె ఎనిమిది చేతులతో దివ్యమైన ఆయుధాలు ధరించి ఎంతో వైభవంగా ప్రకాశిస్తోంది.

శంఖం, చక్రం, గద, పాశం, ఖడ్గం, అంకుశం, ఘంట, విల్లు, ఇంకా ఎన్నో ఆయుధాలు ధరించిన ఆ మహాశక్తి స్వరూపిణి నీటి నుంచి ఆవిర్భవించింది. సింహవాహనం మీద వచ్చిన ఆ దేవి ఒక్కతే ఎన్నో రూపాల్ని ధరించి వైత్రాసురుడి సైన్యంతో యుద్ధం చేసింది.

అలా ఒక వేయి సంవత్సరాలు వైత్రుడితో పోరు కొనసాగించిన దేవి చివరికి తన బలపరాక్రమాలు సంపూర్ణంగా వినియోగించి, మహాబలుడైన వైత్రాసురుణ్ణి ఘోరంగా వధించింది.

వైత్రాసురుడి వధతో దేవతలందరిలో ఆనందం వెల్లివిరిసింది. అందరూ కిలకిలరావాలు చేసారు. సకల దేవతలు, బ్రహ్మ, విష్ణు పరమేశ్వరులతో సహా సామూహికంగా దేవిని భక్తి పూర్వకంగా పూజించారు. శివుడు ప్రత్యేకంగా ఆ దేవిని స్తుతించాడు.

శివుడు చేసిన దేవీ స్తుతి

జయస్వదేవి గాయత్రి మహామాయే మహాప్రభే

మహాదేవి మహాభాగే మహాసత్త్వే మహోత్సవే ॥

దివ్యగస్థను లిప్తాజ్ఞి దివ్యస్రగ్ధానుభూషితే

వేదమాత ర్నమ స్తుభ్యం త్రక్ష్యరస్థే మహేశ్వరీ ||

త్రిలోకస్థే త్రితత్త్వస్థే త్రివహ్నిస్తే త్రిశూలిని,

త్రినేత్రే భీమవక్రే చ భీమనేత్రే భయానకే

కమలాసనజే దేవి సరస్వతి నమోస్తుతే ॥

నమః పఙ్కజ పత్రాక్షి మహామాయే మృత స్రవే

సర్వగే సర్వభూతేశి స్వాహాకారే స్వధే మ్బికే ॥

సంపూర్ణ పూర్ణచంద్రాభే భాస్వరాజ్గ భవోధ్భవే

మహావిద్యే మహావేద్యే మహాద్వైత్య వినాశిని,

మహాబుద్ద్యుద్భవే దేవి వీతశోకే కిరాతిని ॥

త్వం నీతి స్త్వం మహాభాగే త్వం గీ స్త్వం గౌ స్వమక్షరమ్, త్వంధీ స్త్వం శ్రీ స్త్వమోఙ్కార స్తత్వేచాపి పరిస్థితా, సర్వసత్త్వహితే దేవి నమస్తే పరమేశ్వరి ॥

(శ్లో॥ 27-32, అధ్యా-28)

పరమేశ్వరుడు ఈ విధంగా దేవిని స్తుతించగా, ఆ వెంటనే దేవతలందరూ పరమేశ్వరికి జయజయధ్వానాలు పలికారు. బ్రహ్మదేవుడు కూడా దేవికి భక్తి పూర్వకంగా నమస్కరించి అక్కడున్న వారందరితో ఈ దేవి హిమవత్పర్వతం మీదకు వెళ్ళి అక్కడే నివసించుగాక! దేవతలారా! మీరు కూడా దేవితో పాటు హిమాలయాలకి వెళ్ళి ఆమెని సేవించండి. ఆలస్యం చేయకండి. ఈ దేవిని నవమినాడు పూజించాలి.

నమమ్యాంచ సదా పూజ్యా ఇయం దేవీ సమాధినా ।

వరదా సర్వలోకానాం భవిష్యతి న సంశయః ॥

నవమ్యాంయశ్చ పిష్టాశీ భవిష్యతి హిమానవః ।

నారీ నా తస్య సంపన్నం భవిష్యతి మనోగతం ॥

(శ్లో॥37, 38, అధ్యా -28)

నవమినాడు చేసే పూజవల్ల ఆమె ఎంతో సంతోషిస్తుంది. తనని పూజించిన వారందరికీ వరాల్ని ప్రసాదిస్తుంది. ఇందులో సందహమేలేదు.

నవమితిథినాడు స్త్రీకాని, పురుషుడుకానీ పిండిని భుజించి ఈ దేవిని అర్చిస్తే వారి కోరికలన్నీ తీరుతాయి. పరమేశ్వరుడు చేసిన ఈ దివ్యస్తోత్రాన్ని ఉదయం సాయంత్రం, రాత్రి పఠించిన వారికి దేవితోపాటు, పరమేశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు. పరమేశ్వరా! నీవు చేసిన దివ్యస్తోత్రాన్ని పఠించినవారి కష్టాలన్నీ నీవే తీర్చాలి అని శివుడికి కూడా చెప్పాడు.

బ్రహ్మ తిరిగి దేవితో “అమ్మా! జగన్మాతా! పరమేశ్వరీ! నీవు మాకు చేయాల్సిన ఘనకార్యం మరొకటుందమ్మా! భవిష్యత్తులో మహిషాసురుడనే రాక్షసుడు లోకాల్ని, మమ్మల్ని పీడిస్తాడు. అప్పుడు నీవా అసురుణ్ణి వధించి మాకు మేలు చేయాలి తల్లీ! అని కోరాడు. దేవి అందుకు అంగీకరించింది.

వెంటనే దేవతలంతా ఆ దేవిని తీసుకువెళ్ళి ఎంతో ఆనందంగా హిమాలయాల్లో ప్రతిష్ఠించారు. అలా వారంతా ఆనందంగా ప్రతిష్టించిన కారణంగా ఆ దేవికి నందాదేవి అనే పేరు వచ్చింది. నందాదేవి చరిత్రని విన్నవాడు, పఠించినవాడు సకల పాపాలనుంచీ విముక్తుడై చివరికి మోక్షాన్ని పొందుతాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment