అష్టమీతిథి – మాతృకలు
పూర్వం అంధకుడనే మహారాక్షసుడుండేవాడు బ్రహ్మగురించి కఠోరమైన తపస్సుచేసి ఎన్నో వరాలు పొందాడు. ఆ వరగర్వంతో దేవతలందర్నీ ఓడించి వారిని తన వశం చేసుకున్నాడు. దేవతలందరూ దిక్కుతోచక సరాసరి బ్రహ్మ దగ్గరకి వెళ్ళి తమ కష్టాల్ని ఇలా మొరపెట్టుకున్నారు.
“పితామహా! అంధకుడు మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నాడు. దయచేసి మమ్మల్ని వాడి బారినుంచి కాపాడు అని ప్రార్థించగా బ్రహ్మ వారితో సురులారా! నేనే అతడికి ఎన్నో వరాలిచ్చాను. కనుక నేను మిమ్మల్ని కాపాడలేను. పదండి మనందరం కలిసి శివుడి దగ్గరకి వెళదాం అన్నాడు. అందరూ కలిసి శివుడిసన్నిధికి చేరారు.
మూకుమ్మడిగా తన దగ్గరకొచ్చిన దేవతల్ని చూసి పరమేశ్వరుడు “సురులారా! ఏమిటి ఇంత ఆందోళనగా ఉన్నారు. మీకేం కావాలో చెప్పండి” అని అడిగాడు. అప్పుడు దేవతలంతా ముక్తకంఠంతో అంధకుడి వల్ల తాము పడ్డ బాధల్ని శివుడికి విన్నవించారు. అదే సమయంలో గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకుని అంధకుడు అక్కడికొచ్చాడు. శివుణ్ణి ఓడించి పార్వతిని హరించాలని అతడి ఉద్దేశం. వెంటనే తన సైన్యంతో అక్కడున్న వారందరి మీదా దాడి చేసాడు. దేవతలంతా భయంతో శివుడి వెనుక చేరారు.
అంధకుడి చర్య శివుడికెంతో ఆగ్రహాన్ని తెప్పించింది. ఒక్కసారి మనసులో స్మరించగానే వాసుకి, తక్షకుడు, ధనుంజయుడు అనే మహాసర్పాలు వచ్చాయి. వాటిని ఆయన తన నడుముకి చుట్టుకున్నాడు. ఆ వెంటనే నీలుడనే మహారాక్షసుడు ఐరావతంలాంటి భయంకర రూపంతో శివుడి మీదకొచ్చాడు. తన తొండంతో శివుణ్ణి మోదబోయాడు. అక్కడే వున్న నంది వీరభద్రుణ్ణి పిలిచి నీలుడి మీదకి పంపాడు. వీరభద్రుడు మహాట్టహాసం చేస్తూ సింహం రూపాన్ని ధరించి ఒక్కసారి పైకెగిరి ఏకరూపంలో ఉన్న ఆ నీలుణ్ణి చీల్చి చెండాడాడు. వాడి చర్మాన్ని పీకి దాన్ని శివుడికి సమర్పించగా, ఆయన దాన్ని తన మొలకి వస్త్రంగా చుట్టుకున్నాడు. ఆనాటినుంచీ శివుడు గజచర్మాంబరధారిగా కీర్తిపొందాడు.
గజచర్మాన్ని ధరించిన శివుడు భయంకరమైన త్రిశూలాన్ని ధరించి ప్రమధగణాలతో కలిసి అంధకాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. దేవగణాలు ప్రమథగణాలు కలిసి అంధకుడి సైన్యంతో హోరాహోరీగా తలపడుతున్నాయి. నారదహమర్షికి ఈ విషయం తెలిసింది. వెంటనే వైకుంఠానికి వెళ్ళి శ్రీహరికి కైలాసంలో జరుగుతున్న యుద్ధం గురించి చెప్పాడు. అది విని దేవతలకి సాయం చేద్దామని చక్రాయుధాన్ని ధరించి బయలుదేరాడు శ్రీహరి. యుద్ధరంగానికొచ్చి అక్కడ దేవతా సైన్యానికి అండగా నిలబడ్డాడు. అయినా ఏమీ ఉపయోగం లేకపోయింది. అసురులు విజృంభిస్తూనే ఉన్నారు.
మహాదేవుడు సరాసరి అంధకుడితో తలపడ్డాడు. శివుడు తన త్రిశూలంలో అంధకుడి శరీరాన్ని పొడిచాడు. వాడి శరీరం నుంచి రక్తం కారింది. ఆశ్చర్యకరంగా ఆ రక్తం బొట్లు నుంచి వేలాది అంధకాసురులు పుట్టుకురాసాగారు. అయినా చలించక శివుడు తన శూలానికి అంధకాసురుణ్ణి గుచ్చి నాట్యంచేయటం ప్రారంభించాడు. వేలాదిగా పుట్టుకొచ్చి అంధకుల్లో కొందర్ని శ్రీహరి తన చక్రాయుధంతో సంహరించాడు. ఎంతమందిని చంపినా వాడి రక్తం నుంచి ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు.
శివుడికి అంతమంది అంధకుల్ని చూసేసరికి కోపం ముంచుకు వచ్చింది. ఆ కోపం వల్ల ఆయన ముఖం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బైటికొచ్చాయి. ఆ జ్వాలలన్నీ ఒక ఆకారాన్ని ధరించి మహాశక్తిగా మరాయి. ఆమెనే యోగీశ్వరి అంటారు. ఆ వెంటనే విష్ణువు కూడా స్మరించాడు. వెంటనే ఆ అతడి శరీరం నుంచి కూడా ఒక మహాశక్తి ఆవిర్భవించింది. అదే విధంగా బ్రహ్మ-కుమారస్వామి-ఇంద్రుడు-యముడు వరాహదేవుడు ఇలా అందరూ తమ అంశాలతో శక్తిరూపాల్ని సృష్టించారు. అలా వారందరి శరీరాల నుంచి అష్టమాతృకలు ఆవిర్భవించారు.
అష్టమాతృకలు ఎనిమిది మందీ ఎనిమిది రకాల గణాలు కలిగినవారు. వారిలో
- కామగుణంతో- యోగీశ్వరీదేవి
- క్రోధగుణంతో – మహేశ్వరీ
- లోభగుణంతో – వైష్ణవీదేవి
- మదగుణంతో- బ్రహ్మణీదేవి
- మోహగుణంతో- కౌమారీదేవి
- మాత్సర్యగుణంతో – ఐంద్రీదేవి
- క్రూరత్వంతో- యమదండధరాదేవి
- అసూయతో – వారాహీదేవి ఆవిర్భవించారు.
అష్టమాతృకలు ఎనిమిది మందీ అంధకాసురుడి రక్తం నేలమీద పడకుండా పూర్తిగా పీల్చేశారు. దానితో కొత్తగా అంధకాసురులు పుట్టటం ఆగిపోయింది. చివరిగా మిగిలిన అంధకుణ్ణి పరమేశ్వరుడు సంహరించాడు. మాతృకలకి సంబంధించిన ఈ దివ్య వృత్తాంతాన్ని విన్న వారికి ఎప్పుడూ ఆపదల నుంచి రక్షణ లభిస్తుంది. దీన్ని విన్నవాడు ధన్యుడై శివలోకాన్ని చేరుకుంటాడు. అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి అష్టమి. అందుకే ఆ దేవతలకి ఆతిథి ప్రీతికరమైనది. అష్టమినాడు కేవలం మారేడు ఫలాల్ని తింటూ అష్టమాతృకల్ని పూజిస్తే ఆ దేవతలు ఉపాసకుడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందిస్తారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹