Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ఇరవయ్యవ భాగము

షష్ఠీతిథి – కార్తికేయుడి వృత్తాంతం

సకల దేవతలకీ మూలం నారాయణుడు. ఆయన నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మనుంచి స్వయం భువమనువు మరీచ్యాది మహర్షులు ఆవిర్భవించారు. వారందరి నుంచి ద్వాదశ ఆదిత్యులు సకల దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మనుష్యులు, పశుపక్ష్యాది సకల జీవులూ ఆవిర్భవించారు. దీనినే సృష్టి అంటారు. ఈ సృష్టి క్రమక్రమంగా ఎంతో విస్తృతంగా పెరిగిపోయింది. దేవతలు, దానవులు ఒకరిమీద ఒకరు విరోధం పెంచుకుని పరస్పరం యుద్ధాలు చేసుకోవటం ప్రారంభించారు. అయితే దేవతల కన్నా దానవులు ఎంతో దృఢంగా బలవంతులుగా వున్నారు.

దానవ ప్రముఖుల్లో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, విప్రచిత్తి, విచిత్తి, భీమాక్షుడు, క్రీంచుడు వంటి మహావీరులు ఎన్నో యుద్ధాల్లో దేవతల్ని పరిమారుస్తున్నారు. ఇలా దేవతలందరూ నిరంతరం ఓటమి పాలవటం చూసి వారిగురువైన బృహస్పతి వారితో ఇలా అన్నాడు.

“దేవతలారా! నాయకుడు లేనందువల్ల మీ సైన్యమంతా పరాజయం పాలవుతోంది. కేవలం ఇంద్రుడితో ఈ సైన్యమంతా నడపబడలేదు. కనుక మీరంతా మీసైన్యాన్ని నడిపించే సమర్థుడైన సేనాధిపతిని సమకూర్చుకోండి” అని హితోపదేశం చేసాడు.

బృహస్పతి మాటలు విన్న దేవతలంతా వెంటనే బ్రహ్మ దగ్గరకి వెళ్ళి తమకొక గొప్ప సైన్యాధిపతిని ఇవ్వమని ప్రార్థించారు. ఆయన తనకాశక్తి లేదని రుద్రుడొక్కడే అందుకు తగినవాడని చెప్పి, వారందర్నీ వెంట బెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. అందరూ కలిసి మహాదేవుడైన పరమేశ్వరుణ్ణి చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించారు.

దేవతాకృత శంకరస్తుతి

నమో విషమనేత్రాయ నమస్తే త్ర్యమ్బకాయ చ,

నమః సహస్రనేత్రాయ నమస్తే శూలపాణయే ॥

నమః ఖట్వాంగహస్తాయ నమో దణ్ణభృతే కరే,

త్వం దేవ హుతభుగ్జ్వాలా కోటి భాను సమప్రభః ॥

ఆదర్శనేన యద్ దేవ మూఢ విజ్ఞానతో ధునా,

కృత మస్మాభి రేవేశ తదత్ర క్షమ్యతాం ప్రభో ॥

నమస్తినేత్రార్తి హరాయ శంభో త్రిశూలపాణే వికృతాస్యరూప|

సమస్త దేవేశ్వర శుద్ధభావ ప్రసీద రుద్రాచ్యుత సర్వభావ||

పూష్ణో స్య దనాన్తక! భీమరూప! ప్రలంబ భోగీనలులన్తకణ్ణ !

విశాలదేహాచ్యుత! నీలకణ్ణ! ప్రసీద విశ్వేశ్వర! విశ్వమూర్తే!

భగాక్షి సంస్ఫోటన దక్షకర్మా గృహాణ భాగం ముఖతః ప్రధానమ్!

ప్రసీద దేవేశ్వర! నీలకణ్ణ! ప్రపాహి నః సర్వగుణోపపన్న!

సితాఙ్గ రాగా ప్రతిపన్నమూర్తే కపాలధారిం స్త్రీపురఘ్న దేవ, ప్రపాహి నః సర్వభయేషు చైవ ఉమాపతే పుష్కరనాళ జన్మ ॥

పశ్యామ తే దేహగతాన్ సురేశ సర్గాదయో వేదవరా ననస్త

సాజ్గాన్ సవిద్యాన్ సపదక్రమాంశ్చ సర్వాన్ నిలీనాం స్వయి దేవ దేవ॥

భవ శర్వ మహాదేవ పినాకిన్ రుద్ర తేహర,

నతాః స్మ సర్వే విశ్వేశ త్రాహి నః పరమేశ్వర ॥

ఇతం స్తుత స్తదా దేవై ర్దేవదేవో మహేశ్వరః,

తుతోష సర్వదేవానాం వాక్యం చద మువాచ హ ॥

భగస్య నేత్రం భవతు పూష్ణో దన్తా స్తథా మఖః,

దక్షస్యాచ్ఛిద్రతాం యాతు యజ్ఞశ్చాదితేః సుతాః

పశుభావం తథా చాపి ఆపనేష్యామి వః సురాః |

మదర్శనేన యో జాతః పశుభావో దివౌకసామ్!

స మయాపహృతః సద్యః పతిత్వం వో భవిష్యతి ॥

ఈవిధంగా దేవతలందరూ చేసిన స్తుతి విని పశుపతి ఎంతో ఆనందించి
(శ్లో॥ 17-28,అధ్యా-25)

వారితో దేవతలారా! ఎందుకు మీరంతా ఇలా వచ్చారు అని ప్రశ్నించాడు. “ప్రభూ! శంకరా! మేము నిత్యం దానవుల ధాటికి తట్టుకోలేకపోతున్నాం. వారిని నిలువరించి మా సైన్యాన్ని ముందుండి నడిపించే ఒక సేనానాయకుడు మాకు కావాలి. దయచేసి ప్రసాదించు” అని కోరారు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు సురులారా! మీరేమీ చింతించకండి. మీకు తగిన సేనాధిపతిని అందిస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు.

శివుడు ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళి తనలో వున్న శక్తిని గట్టిగా మథించాడు. ఆ విధంగా ఆయనలోవున్న శక్తిని మథనానికి గురై లోపలనుంచి అగ్నిసూర్యుల కాంతితో సమానమైన ఒక కుమారుడు ఆవిర్భవించాడు. ఆకుమారుడు సహజసిద్ధమైన జ్ఞానంతో, సహజశక్తితో జన్మించాడు. (ఈ దేవసేనాధిపతి ఆవిర్భావం ఒక్కో మన్వంతరంలో ఒక్కోవిధంగా జరుగుతుంది) పరమేశ్వరుడి శరీరంలో ఉన్న అహంకారమే దేవసేనాపతి రూపంలో బైటికి వచ్చింది.

శివుడి శరీరంలోంచి దేవసేనాపతి, ఆవిర్భవించగానే దేవతల సంతోషానికి అవధిలేకపోయింది. తమకు సేనాధిపతిని ప్రసాదించి పరమేశ్వరుణ్ణి బ్రహ్మాది దేవతలంతా ఎంతో శ్రద్ధగా పూజించారు. శివుడికి జన్మించిన ఆ కుమారుడికి దేవతలు, ఋషులు, ఎన్నో సిద్ధుల్ని వరాల్ని ప్రసాదించి ఆశీర్వదించారు. అప్పుడా కుమారుడు దేవతలతో ”మీరంతా” నాకు తోడుగా ఒకణ్ణి చూపించండి” అని కోరాడు. అది విన్న మహాదేవుడు “నాయనా! నీకు ఆడుకోవటానికి ”కోడి” నిస్తాను. అలాగే శాఖుడు విశాఖుడు అనే ఇద్దరు సేవకుల్ని కూడా నీకు సమకూరుస్తున్నాను. కుమారా! నేటినుంచీ నీవు భూతగ్రహాలకీ, దేవతా సైన్యానికి సేనాధిపతిగా ఉండు” అని అన్నాడు. అది విన్న దేవతలు సంతోషించి తమకు సేనాధిపతి అయిన కుమారస్వామిని భక్తి. పూర్వకంగా ఇలా స్తుతించారు.

కుమారస్వామి స్తుతి

భవస్వదేవ సేనానీర్మ హేశ్వర సుతప్రభో ॥

షణ్ముఖస్కంధ విశ్వేశ కుక్కుట ధ్వజపావకే ॥

కంపితారే కుమారేశ స్కంధ బాలగ్రహానుగ।

జితారే క్రౌంచ విధ్వంస కృత్తిగా సుతమాతృజ ||

భూతగ్రహపతి శ్రేష్ఠ పావకి ప్రియదర్శన ||

మహాభూతపతేః పుత్రత్రిలోచననమో స్తుతే ॥

(శ్లో॥ 40-43, అధ్యా-25)

ఈ విధంగా దేవతలు స్తుతిస్తుండగా కుమారస్వామి క్రమంగా పెరగటం ప్రారంభించాడు. పన్నెండు మంది సూర్యులకన్నా అధికమైన కాంతితో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ఆ కుమారుడి తేజస్సు ముల్లోకాలకీ వ్యాపించింది.

తరువాత జన్మలో కృత్తిక అగ్ని, సప్తమాతృకలు, పార్వతీదేవి అనేవారు కుమారస్వామి జన్మకి కారకులుగావున్నారు. స్కందుడు సకల పాపాల్నీ రూపుమాపే దైవం సాక్షాత్తు పరమేశ్వరుడే అతన్ని షష్ఠీతిథినాడు దేవసేనాధిపతిగా అభిషేకించారు. కనుక స్కందుడికి ప్రీతిపాత్రమైన తిథి షష్ఠి అని గ్రహించాలి.

షష్ఠీతిథినాడు కేవలం పళ్ళనే ఆహారంగా స్వీకరిస్తూ, మనసుని అదుపులో ఉంచుకుని కార్తికేయుణ్ణి పూజించేవాడు ధనాన్ని, పుత్రుల్ని పొందుతాడు. అలాగే మనసులో ఏ కోరికలున్నా అవి తప్పక తీరతాయి.

యశ్చైతత్ పఠతిస్తోత్రం కార్తికేయస్య మానవః ॥

తస్యగేహే కుమారాణాం క్షేమారోగ్యం భవిష్యతి ॥

(శ్లో॥ 50, అధ్యా -25)

కార్తికేయుడి గురించి దేవతలు చేసిన స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధా భక్తులతో నిత్యం పఠిస్తారో వారి ఇంట్లో ఉన్న పసిపిల్లలకి బాలురకి ఎంతో క్షేమం కలుగుతుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment