పంచమీతిథి, నాగవృత్తాంతం
ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు సృష్టిచేయాలని సంకల్పించగా మొదట ఆయన మనసునుంచి మరీచి మహర్షి పుట్టాడు. ఆ మరీచికొడుకు కశ్యపప్రజాపతి. ఆ కశ్యపుడు దక్షప్రజాపతి కుమార్తె అయిన కద్రువ అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. కద్రువకి కశ్యపుడి ద్వారా ఎంతో బలవంతులైన పుత్రులు జన్మించారు. వారెవరంటే!
అనంతం వాసుకిం చైవ కంబళంచ మహాబలం |
కర్కోటకం చ రాజేంద్ర పద్మంచాన్యం సరీసృపమ్ |
మహాపద్మం తదాశంఖం కులికం చాపరాజితమ్ ।
ఏతే కశ్యపదాయాదాః ప్రధానాః పరికీర్తితాః ॥
(శ్లో॥ 6-7,అధ్యా-24)
అనంతుడు, వాసుకి, కంబళుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు శంఖుడు, అజేయుడైన కులికుడు అనేవారు. ఇక వీరినుంచి పరంపరగా వీరి సంతానంతో జగత్తంతా నిండిపోయింది. వంకర దేహంతో విషపూరితమైన కోరలతో ఈ సర్పజాతి వారంతా మానవుల్ని చూడగానే కాటువేసి వారిని భస్మంచేసేవారు. ఆ విధంగా పాముల వల్ల ఎంతో ఘోరం జరగటంతో అది భరించలేని ప్రజలందరూ దయామయుడైన బ్రహ్మదేవుణ్ణి శరణువేడుకున్నారు. “బ్రహ్మదేవా! ప్రతి రోజూ వేలాది మంది ప్రజలు సర్పాల కాటుకి బలైపోతున్నారు. ఇలాగైతే త్వరలోనే మానవజాతి మొత్తం నశించే ప్రమాదం ఉంది. కనుక నీవెలాగైనా మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు.
మానవుల ప్రార్థన విన్న బ్రహ్మదేవుడు మీరెవ్వరూ భయపడకండి. మీకు రక్షణ నేను కల్పిస్తాను. ఎలాంటి సందేహం లేకుండా మీమీ ఇళ్ళకు వెళ్ళండి అని చెప్పి పంపాడు. బ్రహ్మ మాట విని ప్రజలంతా సంతోషంగా తమ ఇళ్ళకి తిరిగివచ్చారు.
బ్రహ్మదేవుడికి సర్పజాతిమీద విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వారందర్నీ పిలిపించి “సర్పరాజులారా! మీరు ప్రతిరోజూ దయాదాక్షిణ్యం లేకుండా మానవ జాతిని కాటువేసి చంపుతున్నారు. త్వరలో స్వాయంభువ మన్వంతరంలో మీ తల్లి చేత శపించబడి మీరంతా నాశనమౌతారు” అని శపించాడు. బ్రహ్మ శాపం విని కళ్ళు తెరుచుకున్న సర్పప్రముఖులు ఆయన పాదాలపై పడి స్వామీ! మమ్మల్ని క్షమించు, క్రూరత్వం అనే గుణం మాకు పుట్టుకతోనే వచ్చింది. దయచేసి శాంతించు. నీవే కదా మమ్మల్ని ఇలా సృష్టించావు. తిరిగి నీవే శపించటం భావ్యమా!” అని అన్నారు.
నాగుల మాటలు విని బ్రహ్మకి మరింత కోపం వచ్చింది. నాగులారా! మిమ్మల్ని సృష్టించానంటున్నారు సరే! మానవుల్ని అకారణంగా చంపమని నేనే మీకు చెప్పానా! ఎందుకు మీరలా చేస్తున్నారు? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు సర్పరాజులు “ప్రభూ! మాకు మానవులకి హద్దులు ఏర్పాటుచేయి. మా ఇద్దరికీ విడివిడిగా నివాసస్థానాల్ని చూపించు” అని విన్నవించారు. అది విన్న బ్రహ్మ వారితో నాగులారా! నేటినుంచీ మీకు మానవులకు ఒకకట్టడి చేస్తున్నాను. ఇది నా శాసనం. దీనినెవ్వరూ అతిక్రమించకూడదు. మీరంతా భూమిక్రింద ఉన్న పాతాళం, వితలం, హర్మ్యం అనే లోకాల్ని నివాసంగా చేసుకోండి.
అందరూ తక్షణమే ఆ మూడులోకాలకీ వెళ్ళి హాయిగా జీవించండి. ఆ తరువాత వైవస్వత మన్వంతరంలో మీరంతా కశ్యపప్రజాపతికి పుత్రులుగా జన్మిస్తారు. గరుత్మంతుడికి మీరు జ్ఞాతులవుతారు. అప్పుడు జరిగే ఒక యాగంలో మీ సంతానమంతా అగ్నిదేవుడికి ఆహారమవుతుంది. మీలో మంచివారికి ఈ శాపం తగలదు. క్రూరబుద్ధి కలిగినవారు శాపం అనుభవించక తప్పదు.
మీకు ఆకలివేసినప్పుడు, మీకు ఎవరైనా అపకారం తలపెట్టినప్పుడు మనుషుల్ని చంపండి. మంత్రాలతో, ఔషధాలతో, గరుడ సంబంధమైన మండలాల్లో తిరిగే మానవులచేతిలో మీలో దుష్టగుణం కలిగిన నాగులు చిక్కుకుంటారు. అలాంటి వారికి మీరు చిక్కకుండా సంహరించండి. ఇలా కాకుండా మీరు ప్రవర్తిస్తే మీకు వినాశనం తప్పదు” అని హెచ్చరించాడు.
బ్రహ్మదేవుడు ఈ విధంగా హెచ్చరించగానే నాగులందరూ ఆయన చెప్పినలోకాలకి తరలివెళ్ళారు. ఆ లోకాల్లో ఆనందంగా ఎన్నో భోగాలనుభవిస్తూ జీవించారు. పాతాళాన్ని తమ శాశ్వత నివాసంగా చేసుకున్నారు. నాగులకి సంబంధించిన ఈ వృత్తాంతమంతా పంచమీ తిథినాడు జరిగింది. అందువల్ల ఈ తిథి నాగులకి ఎంతో ప్రీతిపాత్రమైనది. పంచమి తిథినాడు పులుపు పదార్థాల్ని వర్జించి నాగుల్ని పాలతో అభిషేకించాలి. అలాచేసిన వారికి నాగుల అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు నాగులవల్ల భయం కూడా తొలగిపోతుంది. ఈ వృత్తాంతాన్ని విన్న వారికి, చదివిన వారికి సకల పాపాలూ హరిస్తాయి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹