పార్వతీదేవి వృత్తాంతం
గౌరీ శంకరులు కైలాసంలో ఆనందంగా కాలం గడుపుతున్నారు. ఒకనాడు గౌరీదేవికి పూర్వం జరిగిన సంఘటనలు గుర్తుకువచ్చాయి. తన తండ్రిచేస్తున్న యాగాన్ని ధ్వంసం చేసినందుకు రుద్రుడి మీద కోపం వచ్చింది. “నా భర్త అయిన ఈ రుద్రుడు అకారణంగా ఆనాడు నా తండ్రిని అవమానించి ఎందరో దేవతల్ని హింసించాడు. కనుక నేను ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరంతో తిరిగి ఈయన్ని చేరుకుంటాను. అంతదాకా రుద్రుడు నా వియోగాన్ని అనుభవిస్తాడు” అని భావించింది. వెంటనే కైలాసం వదిలి హిమాలయంలో రహస్య ప్రాంతానికి వెళ్ళి తన శరీరాన్ని కృశింపచేసి యోగాగ్ని ద్వారా దానిని దగ్ధం చేసుకుంది.
దాక్షాయణి తిరిగి హిమవంతుడికి పుత్రికగా ఉమ అనే పేరుతో జన్మించింది. ఆమె చిన్న తనం నుంచే పరమేశ్వరుడే నా భర్త అని భావిస్తూ శివుడి కోసం ఘోరంగా తపస్సు చేయటం ప్రారంభించింది. కఠోరమైన ఆమె తపస్సుని పరీక్షించటానికి స్వయంగా శివుడే మారువేషంలో వచ్చి పరీక్షించాడు.
ఆమె దీక్షకు, భక్తి శ్రద్ధలకు ఎంతో ఆనందించాడు. తాను కూడా ఉమాదేవినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.
ఈ విషయం తెలిసి హిమవంతుడు ఎంతో ఆనందంగా తన కుమార్తెని శివుడికిచ్చి వివాహం జరపటానికి సమ్మతించాడు. ఒక శుభముహూర్తంలో సకల దేవతలు, రుద్రగణాలు, సిద్ధులు, మహర్షులు, బ్రహ్మర్షుల సమక్షంలో పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరిగింది. వచ్చిన వారందరినీ హిమవంతుడు యథోచితంగా సత్కరించి పంపాడు. ఆ విధంగా సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి తన అల్లుడుగా చేసుకున్న హిమవంతుడు శోకం, పాపం లేని బ్రహ్మ లోకంలో జరిగిన యజ్ఞంలాగా ప్రకాశించాడు.
పార్వతీదేవికి (గౌరీ) సంబంధించిన ఈ వృత్తాంతమంతా తదియ (తృతీయా) తిథినాడు జరిగింది కనుక, తదియనాడు స్త్రీ, పురుషులిద్దరూ ఉప్పు తినకూడదు. అనగా ఉప్పుతో చేసిన ఏ పదార్థాలూ భుజించకూడదు. స్త్రీలు గనుక తదియనాడు ఉపవాసం ఉంటే సౌభాగ్యాన్ని పొందుతారు. దరిద్రులైన స్త్రీ లేక పురుషుడు ఈ కథని విని తదియనాడు ఉప్పుని వర్ణిస్తే వారి దరిద్రాలు తొలగిపోయి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹