Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – పదహారవ భాగము

తృతీయా (తదియ) తిథి-గౌరీ-రుద్రసృష్టి వృత్తాంతం :-

పూర్వం బ్రహ్మదేవుడు వివిధరకాలుగా సృష్టిచేయాలని సంకల్పించాడు. అయితే ఆయన ఎంత ప్రయత్నించినా సృష్టి జరగటం లేదు. దాంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి రుద్రుడనేవాడు జన్మించాడు. పుట్టటంతోనే ఆ బాలుడు రోదనం (ఏడవటం) చేయటం వల్ల అతడికి రుద్రుడనే పేరు పెట్టాడు బ్రహ్మ. కొంతకాలం తరువాత ఆ రుద్రుడికి ఒక భార్యని ఏర్పర్చాలని సంకల్పించిన బ్రహ్మ తన శరీరం నుంచి గౌరి అనే అందమైన కన్యని సృష్టించాడు. ఆ అందాల గౌరిని రుద్రుడుకిచ్చి వివాహం జరిపించాడు.

రుద్రుడు గౌరిని స్వీకరించి ఎంతో ఆనందించాడు. కొన్నాళ్ళు గడిచాక బ్రహ్మ రుద్రుణ్ణి పిలిచి సంతానాన్ని వృద్ధి చేయమని ఆజ్ఞాపించాడు. తండ్రి మాట విన్న రుద్రుడు. సంతానం వృద్ధి చేయాలంటే ముందుగా తపస్సు చేసి శక్తిని సంపాదించాలని భావించి, వెంటనే నీటిలో మునిగి తపస్సు చేయటం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన బ్రహ్మ వెలుపలే వున్న గౌరిని తిరిగి తన శరీరంలోకి లీనం చేసుకున్నాడు.

బ్రహ్మదేవుడు, రుద్రుడు సంతానాన్ని వృద్ధిచేయకుండా తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోగా, తిరిగి ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు. వెంటనే తన మనసునుంచి దక్షుడితో పాటు ఏడుగురు ప్రజాపతుల్ని సృష్టించాడు. వారంతా బ్రహ్మ ఆదేశాన్ని పాటిస్తూ సృష్టిని కొనసాగించారు. దక్షుడికి తదితర ప్రజాపతులకి దేవతలు, అష్టవసువులు ద్వాదశ ఆదిత్యులు సప్తమరుత్తులు అనేవారు జన్మించారు. వారంతా తిరిగి అసంఖ్యాకంగా తమ తమ గణాల్ని వృద్ధి చేశారు. బ్రహ్మ దేవుడు ఇంతకుముందు తనలో లీనం చేసుకున్న గౌరిని దక్షప్రజాపతికి కుమార్తెగా ప్రసాదించాడు. ఆ విధంగా గౌరి దక్షుడి కూతురు దాక్షాయణిగా తిరిగి జన్మించింది.

దక్షప్రజాపతి ఇంకా ఎంతోమంది సంతానాన్ని కని ప్రజాసృష్టిని మరింతగా వృద్ధిచేయాలని భావించాడు. అందుకోసం గొప్పయాగాన్ని తలపెట్టాడు. ఎంతో గొప్పదైన ఆ యాగాన్ని నిర్వహించటానికి మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతసుడు, వశిష్ఠుడు, సనకుడు లాంటి మహర్షులు బ్రహ్మ మానసపుత్రులు విచ్చేసారు.

మహావైభవంగా సాగుతున్న దక్షుడి యజ్ఞంలో ఎంతోమంది దేవతలు స్వయంగా పాల్గొన్నారు. ఆయన యజ్ఞంలో సమర్పించే ఆహుతుల్ని, హవిస్సుల్ని విశ్వేదేవతలు, పితృదేవతలు, గంధర్వులు, స్వయంగా వచ్చి స్వీకరిస్తున్నారు. అంతలో పూర్వం తపస్సుకోసం నీటిలో మునిగిన రుద్రుడు ఒక్కసారిగా పైకిలేచాడు. వెయ్యి సూర్యుల తేజస్సుతో ఆ మహాదేవుడు దివ్యంగా వెలిగిపోతున్నాడు. పైకిలేచిన ఆ మహారుద్రుడు ఒక్క పెట్టున గట్టిగా రోదించాడు.

ఎన్నో వేల సంవత్సరాలు నీళ్ళల్లో ఉండి తపస్సుచేసి మేల్కొన్న రుద్రుడు చక్కని పైర్లతో, అడవులతో, కొండలతో, నదులు, సముద్రాలతో ఉన్న భూమండలాన్ని చూసాడు. అలాగే దక్షుడి యజ్ఞవాటికలో ఋత్విక్కులు చేస్తున్న వేదనాదాల్ని కూడా విన్నాడు. అవి వినేసరికి రుద్రుడికి కోపం వచ్చింది. వెంటనే పెద్ద స్వరంతో మీరంతా ఎవరు? బ్రహ్మదేవుడు మొదట నన్ను పుట్టించి సృష్టి చేయమన్నాడు. నేను వచ్చే లోపల ఈ సృష్టినంతా ఎవరుచేసారు? అని మహాభీకరంగా గర్జించాడు. అప్పుడాయన చెవులు నుంచి భయంకరమైన భూతాలు, పిశాచాలు, ప్రేతాలు, కూష్మాండాది అసుర, భేతాళగణాలు కోట్లకొద్దీ ఆవిర్భవించాయి. వారంతా దక్షయజ్ఞ విధ్వంసానికి పూనుకున్నారు.

దేవతలకి రుద్రగణాలకీ మధ్య పోరు ప్రారంభమైంది. ఒకర్నొకరు తీవ్రంగా గాయపరుచుకుంటున్నారు. అంతలో రుద్రుడు, మహావిష్ణువు తలపడ్డారు. ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాల్ని ప్రయోగించుకోసాగారు.

లోకాలన్నీ ఈ సంగ్రామం తాకిడికి తల్లడిల్లిపోయాయి. ఈ విషయం తెలిసిన బ్రహ్మ పరుగున అక్కడికి వచ్చి రుద్ర-విష్ణువుల్ని శాంతింపచేసాడు. వారితో “రుద్ర-విష్ణులారా! మీ ఇద్దరూ హరిహరులుగా లోకంలో కీర్తి పొందుతారు. మీ ఇద్దరూ శత్రువులు కారు. నేటి నుంచీ శాశ్వత మిత్రులు ఈ దక్షుడి యజ్ఞం ఇప్పుడు విధ్వంసమైంది. ముందు ఈ యజ్ఞాన్ని ఉద్ధరించి లోకాలకి మేలు చేయండి అని వారికి హితబోధ చేసాడు. ఆ తరువాత దక్షాది ప్రజాపతులవైపు తిరిగి ప్రజాపతులారా! ఈ రుద్రుడు నా పుత్రుడు నేటి నుంచీ మీరు చేసే యజ్ఞాలలో జ్యేష్ఠబాగాన్ని రుద్రుడికివ్వండి. రుద్రుడు మీ అందరికీ ఆరాధ్యనీయుడు. ఈ మహాదేవుణ్ణి స్తుతించి సకల శుభాలూ పొందండి” అని ఆజ్ఞాపించాడు. వెంటనే దేవతలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో రుద్రుణ్ణి ఇలా స్తుతించటం ప్రారంభించారు.

సకల దేవతాకృత రుద్రస్తుతి

నమో విషమనేత్రాయ నమస్తే త్ర్యమ్బకాయ చ|

నమః సహస్రనేత్రాయ నమస్తే శూలపాణయే ॥

నమః ఖట్వాంగహస్తాయ నమో దణ్ణభృతే కరే|

త్వం దేవ హుతభుగ్జ్వాలా కోటి భాను సమప్రభః ॥

ఆదర్శనేన యద్ దేవ మూఢ విజ్ఞానతో ధునా|

కృత మస్మాభి రేవేశ తత్ర క్షమ్యతాం ప్రభో ॥

నమస్తినేత్రార్తి హరాయ శంభో త్రిశూలపాణే వికృతాస్యరూప|

సమస్త దేవేశ్వర శుద్ధభావ ప్రసీద రుద్రాచ్యుత సర్వభావ

పూష్ణో స్య దనాన్తక! భీమరూప! ప్రలంబ భోగీనలులన్తకణ్ణ !

విశాలదేహాచ్యుత! నీలకణ! ప్రసీద విశ్వేశ్వర! విశ్వమూర్తే!

భగాక్షి సంస్ఫోటన దక్షకర్మా గృహాణ భాగం ముఖతః ప్రధానమ్||

ప్రసీద దేవేశ్వర! నీలకణ్ణ! ప్రపాహి నః సర్వగుణోపపన్న!

సితాఙ్గ రాగా ప్రతిపన్నమూర్తే కపాలధారిం స్త్రీపురఘ్న దేవ||

ప్రపాహి నః సర్వభయేషు చైవ ఉమాపతే పుష్కరనాళ జన్మ ॥

పశ్యామ తే దేహగతాన్ సురేశ సర్గాదయో వేదవరా ననస్త||

సాన్ విద్యాన్ సపదక్రమాంశ్చ సర్వాన్ నిలీనాం స్వయి దేవ దేవ ॥

భవ శర్వ మహాదేవ పినాకిన్ రుద్ర తేహర,

నతాః స్మ సర్వే విశ్వేశ త్రాహి నః పరమేశ్వర ॥

ఇతం స్తుత స్తదా దేవా ర్దేవదేవో మహేశ్వరః,|

తుతోష సర్వదేవానాం వాక్యం చద మువాచ హ ||

భగస్య నేత్రం భవతు పూష్ణో దన్తా స్తథా మఖః,

దక్షస్యాచ్ఛిద్రతాం యాతు యజ్ఞశ్చాదితేః సుతాః

పశుభావం తథా చాపి ఆపనేష్యామి వః సురాః॥

మదర్శనేన యో జాతః పశుభావో దివౌకసామ్

స మయాపహృతః సద్యః పతిత్వం వో భవిష్యతి॥

(శ్లో॥ 64-73, అధ్యా-21)

ఆ విధంగా దేవతలందరూ తనని భక్తిగా స్తుతించటంతో రుద్రుడు శాంతించాడు. ఎంతో ప్రశాంతంగా వారితో “దేవతలారా! మా భూతగణాలతో జరిగిన యుద్ధంలో మీ దేవతలకి తగిలిన గాయాలన్నీ మానిపోగాక! దక్షుడు చేస్తున్న ఈ యజ్ఞం ఏ లోపం లేకుండా సాగుగాక! మీలో ఉన్న పశుభావం తొలగిపోవుగాక! మీమీ ఆధిపత్యాలు మీకు తిరిగి లభించుగాక! నేను అన్ని విద్యలకీ ప్రభువుని. సనాతనుణ్ణి. నేనే పశుపతిని, నన్ను పూజించిన వారికి పాశుపతదీక్ష లభిస్తుంది” అని పలికాడు.

రుద్రుడి వచనాలు విన్న బ్రహ్మ సంతోషించి “ఆయనతో రుద్రా! నీవు లోకంలో పశుపతిగా ఎంతో కీర్తి పొందుతావు. ఇది సత్యం” అని చెప్పి దక్షుణ్ణి పిలిచి అతడి కుమార్తెని గౌరిని రుద్రుడికిచ్చి వివాహం చేయమని ఆజ్ఞాపించాడు. దక్షుడు ఆనందంగా అంగీకరించి సకల దేవతల సమక్షంలో సర్వమంగళకారిణి అయిన గౌరిని శంకరుడికిచ్చి వివాహం జరిపించాడు. దాక్షాయణిని చేపట్టిన శివుడికి కైలాసాన్ని నివాసంగా ఏర్పాటుచేసాడు బ్రహ్మ. వెంటనే రుద్రుడు తన భూత గణాలన్నిటినీ వెంటబెట్టుకుని దాక్షాయణితో సహా కైలాసానికి వెళ్ళిపోయాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment