ద్వితీయాతిథి – అశ్వినీ దేవతలు
బ్రహ్మదేవుడు స్వయంగా తొమ్మిది మంది మహర్షులుగా అవతరించాడు. వారిలో మరీచి మహర్షి ఎంతో గొప్పవాడుగా ప్రసిద్ధిచెందాడు. ఆ మరీచికి కశ్యపుడనే ప్రజాపతి జన్మించాడు. కశ్యపుడు దేవతలకు తండ్రి. ఆయనకి తన భార్య అదితి ద్వారా పన్నెండుమంది ఆదిత్యులు (సూర్యులు) పుత్రులుగా జన్మించారు. ఆదిత్యులు నారాయణ స్వరూపులు. ఒక్కటిగా ఉన్న నారాయణ స్వరూపమే పన్నెండు విధాలుగా రూపొందింది. ఈ ద్వాదశ ఆదిత్యుల్లో మహాతేజోవంతుడుగా మర్తాండుడు ప్రసిద్ధి చెందాడు. శ్రీహరి సంవత్సర స్వరూపుడు కాగా 12 మంది ఆదిత్యులు 12 మాసాలుగా ఉన్నారు.
మార్తాండుడికి త్వష్టప్రజాపతి తన కూతురు ”సంజ్ఞ” అనే కన్యనిచ్చి వివాహం జరిపించాడు. మర్తాండుడికి, సంజ్ఞాదేవికి యముడు, యమున అనే ఇద్దరు పురుష స్త్రీ సంతానం కలిగారు. అయితే సంజ్ఞాదేవి మర్తాండుడి తేజస్సుని భరించలేకపోయేది. ఇక ఆయన దగ్గర ఉండలేక ఒక ఛాయా సంజ్ఞని సృష్టించి ఆమెని తన భర్త దగ్గర ఉంచింది. తాను ఒక ఆడగుఱ్ఱంగా మారి ఉత్తర కురుభూమిలో తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలియని మార్తాండుడు ఛాయసంజ్ఞతో సంసారం చేసి శని తపతి అనే ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఛాయా సంజ్ఞ తన పిల్లల్ని – అసలు సంజ్ఞాదేవి పిల్లల్ని వివక్షతో చూడటం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న మార్తాండుడు ఆమెని హెచ్చరించాడు. అలా పిల్లల మధ్య విచక్షణ చూపకూడదని హితవుచెప్పాడు. అయినా ఆమె తీరేం మారలేదు.
ఒకనాడు యముడు ఎంతో దుఃఖిస్తూ తండ్రి దగ్గరకొచ్చి నాయనా! ఈమె మా తల్లిలా లేదు. మా మీద ఎంతో శత్రుత్వం పెంచుకుంది. సవతి తల్లిలా మమ్మల్ని ప్రతిదానికీ దూషిస్తోందని” చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న ఛాయా సంజ్ఞని యముడిని ” ప్రేతాలకు రాజువికా” అని శపించింది. మార్తాండుడికి ఆ విషయం తెలిసి తన పుత్రుడైన యముణ్ణి పిలిచి కుమారా! నీవేం బాధపడకు. నీవు సమవర్తిగా, యమధర్మరాజుగా కీర్తి పొందుతావు అని వరాన్ని ప్రసాదించాడు.
మార్తాండుడికి అసలు విషయం తెలిసింది. తన దగ్గరున్నది తన భార్య కాదని గ్రహించాడు. వెంటనే తాను ఒక మగగుఱ్ఱంలా మారి ఉత్తర కురుభూముల వైపు ప్రయాణమయ్యాడు. కురు భూమిలో సంజ్ఞాదేవి ఆడగుఱ్ఱం రూపంలో నివసిస్తోంది. మర్తాండుడు అక్కడకి వచ్చి ఆమెతో ఆనందంగా అశ్వరూపంలో సంగమించాడు. వారిద్దరికీ అశ్వరూపులైన ఇద్దరు పుత్రులు జన్మించారు. వారే అశ్వినీ దేవతలు. అశ్వినీ దేవతలిద్దరూ తమ తండ్రి అయిన మార్తాండుడి దగ్గరకొచ్చి తండ్రీ! మేము ఏం చేయాలి? మా కర్తవ్యాన్ని నిర్దేశించండి అని కోరారు. అప్పుడు మార్తాండుడు వారితో “కుమారులారా! మీరిద్దరూ భక్తి శ్రద్ధలతో పరబ్రహ్మ నారాయణుణ్ణి ఉపాసించండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది అని ప్రబోధించాడు. అంతేకాదు వారిద్దరికీ ఆ నారాయణ పరబ్రహ్మ స్తోత్రాన్ని కూడా ఉపదేశించాడు.
నారాయణ పరబ్రహ్మ స్తోత్రం
ఓం నమస్తే నిష్క్రియ నిష్ప్రపంచ నిరాశ్రయ నిరపేక్ష నిరాలంబ,
నిర్గుణ నిరాలోక నిరాధార నిర్మమ నిరాకార ॥
బ్రహ్మ మహాబ్రహ్మ బ్రాహ్మణ ప్రియ,
పురుష మహాపురుష పురుషోత్తమ
దేవ మహాదేవ దేవోత్తమ స్థాణో స్థితిస్థాపక ॥
భూత మహాభూత భూతాధిపతే యక్ష మహాయక్ష యక్షాధిపతే|
గుహ్య మహాగుహ్య గుహ్యాధిపతే సౌమ్య మహాసౌమ్య సౌమ్యాధిపతే ॥
పక్షి మహాపక్షి పతే దైత్య మహాదైత్యాధిపతే రుద్ర
మహారుద్రాధిపతే విష్ణో మహావిష్ణుపతే|
పరమేశ్వర నారాయణ ప్రజాపతయే నమః ॥
శ్లో॥ 28-30, అధ్యా-20,
ఈ విధంగా అశ్వినీదేవతలు సూర్యుడు చెప్పిన ఈ నారాయణ పరబ్రహ్మ స్తోత్రాన్ని ఎంతో శ్రద్ధగా పఠిస్తూ ఎన్నో సంవత్సరాలు దీక్షగా తపస్సు చేశారు. ఒక శుభముహూర్తంలో ప్రజాపతి అయిన ఆ పరబ్రహ్మ వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
అశ్వినీదేవతలు ప్రజాపతికి భక్తితో నమస్కరించి వినయంగా “ప్రభూ! మా ఇద్దరికీ సోమరసాన్ని త్రాగే అధికారాన్ని ప్రసాదించు. శాశ్వతంగా మాకు దేవతలతో సమానమైన స్థితిని కల్పించు. మాకొక ప్రత్యేక గుర్తింపు కావాలి ప్రభూ! ఇదే మా కోరిక అని అన్నారు. ప్రజాపతి చిరునవ్వుతో “అశ్వినీ దేవతలారా! మీరు నేటి నుంచీ సోమపానం చేసే అర్హత పొందుతారు. అలాగే దేవ వైద్యులుగా మీరు ప్రసిద్ధి చెందుతారు. మీరు దేవతలతో సమానంగా పూజించబడతారు. అందమైన రూపం, తేజస్సు మీకు కలుగుతాయి” అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు.
అశ్వినీ దేవతలు ప్రజాపతి ద్వారా ఉత్తమమైన వరాన్ని పొందిన తిథి విదియ. కనుక ఈ తిథి అశ్వినీ దేవతలకి అత్యంత ప్రీతిపాత్రమైనది. మంచి రూపాన్ని, తేజస్సుని, ఆరోగ్యాన్ని పొందాలనుకునేవారు ప్రతి విదియ (ద్వితీయతిథి) నాడు కేవలం పుష్పాల్నే ఆహారంగా స్వీకరిస్తూ ఒక సంవత్సరకాలం అశ్వినీ దేవతల్ని ఆరాధిస్తే వారికి ఆరోగ్యం, ఆయుర్దాయం, సౌందర్యం తేజస్సు లభిస్తాయి. ఇది ఎంతో శుభప్రదమైన అశ్వినీ దేవతలవ్రతం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹