ధర్మవ్యాధుడి వృత్తాంతం
పూర్వం వసుమహారాజు శరీరం నుంచి ”వ్యాధు”డనే కిరాతుడు పుట్టాడు. ఆ వ్యాధుడు వేటని జీవనవృత్తిగా చేసుకుని నాలుగువేల సంవత్సరాలు కాలం గడిపాడు. తన కుటుంబంకోసం రోజుకొక్క అడవి పందిని చంపి తన సేవకుల్ని, బంధువుల్ని, అతిథుల్ని, అగ్నిని సంతృప్తి పరిచేవాడు. అతడు కిరాతుడైనప్పటికీ మిథిలానగరంలో ప్రతి అమావాస్యనాడు తన పితృదేవతలకి శ్రాద్ధకర్మల్ని శ్రద్ధగా నిర్వహించేవాడు. ప్రతిరోజూ అగ్నిని పూజిస్తూ, నిత్య కర్మల్ని ఆచరిస్తూ సత్యాన్నే పలుకుతూ తన జీవనయాత్ర కొనసాగిస్తున్నాడు. ఏనాడు అతడు సాధుజంతువుల్ని చంపలేదు. ఈవిధంగా ధర్మ బద్దంగా జీవిస్తున్న వ్యాధుడికి ”అర్జునకుడు” అనే కుమారుడు జన్మించాడు.
అర్జునకుడు కూడా ఎంతో ధర్మబుద్ధి కలిగినవాడు. ఇంద్రియాలమీద నిగ్రహాన్ని కలిగి తపస్సుమీద ఆసక్తిని పెంచుకున్నాడు. కొంతకాలం గడిచాక ధర్మవ్యాథుడికి ”అర్జునకి’ అనే ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆ కన్యకి యుక్తవయసు రాగా, ఆమెని ఎవరికిచ్చి వివాహం జరిపించాలి. ఆమెకి తగిన వరుడెవడు? అని ఆలోచించసాగాడు. ధర్మవ్యాథుడికి మతంగుడి కొడుకైన ప్రసన్నుడు తన కూతురుకి తగిన వరుడు అని అనిపించింది. వెంటనే మతంగుడితో మాట్లాడి తన కుమార్తె అర్జునకిని మతంగుడి పుత్రుడు ప్రసన్నుడికిచ్చి వివాహం జరిపించాడు.
ధర్మవ్యాథుడి కూతురు ”అర్జునకి” కూడా తండ్రిలాగానే ధర్మపరాయణురాలు. అత్తగారింటికి వెళ్ళి అక్కడ తన అత్తమామలకి ఏ లోటూ రాకుండా సేవలు చేస్తోంది. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు అర్జునకి అత్తగారు ఆమెతో ” ఓ కోడలా! నీవు నిత్యం జంతువుల్ని వధించే బోయగాడి కూతురువి. నీవు కూడా తండ్రికి తగ్గ దానివే. నీకు తపస్సు చేయటం, భర్తని శ్రద్ధగా సేవించటం తెలియదు” అని పరుషంగా మాట్లాడింది. అత్తగారి మందలింపు విని అర్జునకి ఎంతో బాధపడింది. వెంటే తన తండ్రి ఇంటికి వెళ్ళి విలపించసాగింది. ధర్మవ్యాధుడు ఆమెని ఊరడించి “అమ్మా! ఎందుకు విలపిస్తున్నావు” అని అనునయంగా అడిగాడు. తండ్రీ! నా అత్తగారు అకారణంగా నన్ను దూషించింది. అందుకే నేనింతగా బాధపడుతున్నాను అని అత్త తనని అన్న మాటలు యధాతథంగా చెప్పింది.
అర్జునకి చెప్పిన మాటలు విన్నాక ధర్మవ్యాధుడికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే మతంగుడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన ధర్మవ్యాధుణ్ణి చూసి మతంగుడు ఆదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఆ తరువాత కుశల ప్రశ్నలు వేసి తన ఇంటికి వచ్చిన కారణాన్ని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు మతంగుడితో మతంగా! నేను నీ ఇంట్లో “ప్రాణం లేని ఆహారాన్ని” భుజించాలనుకుంటున్నాను అని అన్నాడు.
మతంగుడు ధర్మవ్యాధుడితో “అయ్యా! మా ఇంట్లో గోధుమలు, బియ్యం, యవలు లాంటి ధాన్యాలున్నాయి. వాటిలో నీకిష్టం వచ్చిన వాటిని భుజించవచ్చు అని అన్నాడు. అది విని మతంగా నీవు చెప్పిన యవలు, గోధుమలు, బియ్యం అదే రూపంలో వున్నాయా ఏదీ చూపించు అనడిగాడు. అప్పుడు మతంగుడు గోధుమలతో నిండిన చేటని, బియ్యంతో నిండిన మరోచాటని ఆయనకి చూపించాడు. వాటిని చూసిన ధర్మవ్యాథుడు ఇక చాలు నేను వెళ్తాను అని బయలుదేరాడు. ఆశ్యర్యపోయిన మతంగుడు స్వామీ! తమరు భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారు ఏమిటి కారణం? అనడిగాడు. మతంగా! ప్రతిరోజూ నీవు వేలకొద్దీ జీవుల్ని చంపుతున్నావు నీవు పాపాత్ముడవే కదా! నీ ఇంట్లో ప్రాణశక్తి లేని పదార్థమేదైనా ఉంటే దాన్ని వండి అప్పుడు నాకు భోజనం పెట్టు. ఇప్పుడు నాకు చూపించిన ధాన్యాలన్నీ నీటి ద్వారా జన్మించినవేకదా! ఈ ధాన్యాల్ని నాటితే తిరిగి మొలకలు వస్తాయి కదా! అంటే ఆ గింజల్లో ప్రాణం ఉన్నట్టేగా, మరి ప్రాణం ఉన్న ఆ గింజల్ని వండటం ద్వారా చంపుతున్నావా లేదా! అది జీవహింస కాదా! నేను నా సంసారం కోసం, బంధువులకోసం రోజుకొక మృగాన్ని చంపి, దాన్ని ముందుగా పితృదేవతలకి అర్పించి ఆ తరువాతే నేను నా కుటుంబం భుజిస్తాం. ఇక నీవు నిత్యం రకరకాల ధాన్యాలరూపంలో ఎన్నో జీవుల్ని చంపి నీవారితో కలిసి తింటున్నావు. ఇది తినరాని తిండి అని నా అభిప్రాయం.
బ్రహ్మదేవుడు మొదట చెట్టు, చేమల్ని, తీగల్ని యజ్ఞం కోసం పుట్టించాడు. కాలక్రమంలో అవే ప్రాణులకి ఆహారంగా మారాయి. 1. దేవయజ్ఞం 2.భూతయజ్ఞం 3.పితృయజ్ఞం 4. మనుష్యయజ్ఞం 5. బ్రహ్మయజ్ఞం అని అయిదు మహాయజ్ఞాలున్నాయి. బ్రహ్మ దేవుడు వీటిని ఏర్పరిచాడు. ఈ యజ్ఞాల కోసం వండిన అన్నమే ఉత్తమమైన అన్నం అవుతుంది. అలా కాకపోతే ఒక్కో ధాన్యంగింజా పశుపక్ష్యాదులు లాంటిదే కనుక అది పెట్టేవాడికి, తినేవాడికీ మాంసాహారమే అవుతుంది.
దేవతలాంటి నా కుమార్తెని నీకు కోడలిగా చేసాను. నీ భార్య నా కుమార్తెని “జంతువులు చంపేవాడి బిడ్డవి. నీకే ఆచారాలు, మర్యాదలు తెలియవు” అని నిందించింది. అందుకే నీవు నీ కుటుంబం ఎంతటి ఆచారవంతులో తెలుసుకుందామని నీ ఇంటికి వచ్చాను.
మతంగా! నీ ఇంట్లో నాకు గొప్ప ఆచారం ఏదీ కనిపించలేదు. నేను మా ఇంటికి వెళుతున్నాను. పితృశ్రాద్ధం చేయాలి. శ్రాద్ధ దినం కనుక నేను నీ ఇంట్లో భోజనం చేయను. నేనేమో ప్రాణహింస చేసేవాడినా! నీవు మాత్రం పరమ అహింసాపరుడివా! ఇదేమన్నా న్యాయంగా వుందా! “ఇక నేటినుంచీ అత్తలకు కోడళ్ళపై నమ్మకం లేకుండుగాక! అలాగే కోడళ్ళు అత్త బ్రతికి ఉండటాన్ని ఇష్టపడకపోవుగాక!” అని శపించి ధర్మవ్యాధుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు.
కొంతకాలం తరువాత ధర్మవ్యాథుడు తన కుటుంబ బాధ్యతల్ని పెద్ద కుమారుడైన ”అర్జునకుడికి అప్పగించి, ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందిన పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చలమైన మనసుతో భగవంతుణ్ణి ఇలా స్తుతించి తపస్సు చేయటం ప్రారంభించాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹