శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన అన్నాడు – "ఈ శరీరం చచ్చిపోతుంది – బెంగలేదు" అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది. ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగం చేసినా తపస్సు చేసినా, అశ్వమేధ యాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు. పడితీరుతుంది. ధ్రువుడంతటివాని శరీరం పడిపోయింది. ఎవని శరీరం అయినా పడిపోవలసిందే! పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు. ఈ భ్రాంతిచేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటిని చెయ్యడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి "నేను" అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు. "నేను" అనబడునది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు. అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది. మరణభయంలో సమస్తమయిన అజ్ఞానం ఉంది. అవిద్య ఉంది. భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యమును పట్టుకో. అది అంత తేలికయిన విషయం కాదు.
భాగవతమును వినినవాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యముపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్నవాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి.
ఏడురోజులు భాగవతమును విని పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ ఏడురోజులు పోయిన తరువాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. – "శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను" అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము.
"మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ" (సౌందర్యలహరి – 97) అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో.
అలా మాయలో తిరుగుతూనె ఉన్నాము. ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది. అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలు అంటారు
’నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’
భాగవతమును వినేవాళ్ళు "భాగవతమును నేను వింటున్నాను" అని ఎప్పుడూ వినకూడదు. "పిబత భాగవతం" – భాగవతమును తాగేసెయ్యి. కానీ ఇదెలా సాధ్యం? భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది? తాగడమును నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి. వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి. కాని చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి – అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది. ఒకవేళ ఆ పాలలో ఒక చీమ ఉన్నా నోరు పుచ్చుకోను అనదు.
పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలొ సాధారణంగా మీరు తీసిపారేసేది ఏదీ ఉండదు. భాగవతము కూడా అటువంటిదే. దీనిలో తీసిపారవేయవలసినది ఏదీ ఉండదు. భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే! భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసెయ్యి. విడిచిపెట్టావంటే జారి క్రిందపడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం?
వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమయిన కోర్కెలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది. వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి.
ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరిభాగములలో పండిన పండు ఉపనిషత్తులచేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది. దీనిని చిలక కొట్టింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తననోటిద్వారా ప్రవచనం చేశారు. దేనిమీదా అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది.
భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది. ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారు.
వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి ముగ్గురిపేర్లలో రాచరికం ఉంది. వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు. సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసుగారు అయిపోయారు. త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజుగారు పోతన్న అయ్యారు. ముగ్గురూ రాచరికాలను తీసి అవతలపారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు.
పోతనగారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమిమాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఒకమాట వింటూ ఉంటాము – "ఏదోనండి, రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది – కానీ ఎక్కడండీ ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తరువాత సంసారం – వీటితోనే సరిపోతోంది – భాగవతం పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండీ – కుదరడం లేదు – నాకూ చదవాలని ఉంటుంది" అంటూ ఉంటారు. మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలిపట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలము దున్నారో, ఎప్పుడు మంచెమీద కూర్చున్నారో తెలియదు. త్రికాలములయందు సంధ్యావందనం చేసుకొని ఒకానొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరినదిలో స్నానం చేసి ఒకసైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు. అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది. "పోతనా! నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు. తెలుగులో వ్రాయి" అన్నారు. వెంటనే పోతనగారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు – ’అయ్యా మీరు ఆనతిచ్చారు. నేను భాగవతమును వ్రాయడమేమిటి!"
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
బలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా?
ఎంత వినయముతో చెప్పారో చూడండి! "నేను భాగవతమును రచించడం ప్రారంభంచేస్తున్నాను. కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతనా! నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మలనుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు. ఇంకొకగాథ నేను ఎందుకు పలకాలి? అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను" అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹